
ఏపీలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం: పవన్ కల్యాణ్
పారిశ్రామిక ప్రగతితోపాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు ఆచరణలోకి వస్తున్నాయి. పరిశ్రమల పరిధిలోని భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉండేలా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున 26 పరిశ్రమలను ఎంపిక చేసి 33 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జూలై 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 11న ముగిసింది. కేవలం 14 రోజుల్లోనే ఎంపిక చేసిన 26 పరిశ్రమలు నిర్దేశిత గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించాయి.
129 ఎకరాల్లో 43,300 మొక్కలు
తొలి దశలో భాగంగా 26 పరిశ్రమల పరిధిలో మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానికంగా అనువైన దేశీయ జాతులతోపాటు పండ్ల మొక్కలు, సుందరీకరణకు ఉపయోగపడే మొక్కలను నాటారు. వేప, కానుగ, రావి, నేరేడు తదితర మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. భారీ పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మిగిలిన పరిశ్రమల్లోనూ అమలు
పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి కల్పనతోపాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తొలి దశలో 33 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని పీసీబీ అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని మిగిలిన పరిశ్రమలు కూడా గ్రీన్ కవర్ లక్ష్యంలో భాగస్వాములయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి శాఖ, ప్రతి పరిశ్రమ బాధ్యతాయుతంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
