Let's talk: editor@tmv.in
ఏపీలో నేతన్నలకు తీపి కబురు ... నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏపీలో నేతన్నలకు తీపి కబురు ... నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

Panthagani Anusha
1 ఏప్రిల్, 2026

రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల హామీల అమలులో భాగంగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ నేతన్నలకు ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకాన్ని నేటి నుంచి (ఏప్రిల్ 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో విద్యుత్ బిల్లుల భారం నుంచి నేతన్నలకు విముక్తి లభించడమే కాకుండా కులవృత్తిని నమ్ముకున్న లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద చేనేత (హ్యాండ్లూమ్) కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు పవర్‌లూమ్ యజమానులకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.కాగా ఈ బృహత్తర పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.150 కోట్ల అదనపు వ్యయాన్ని భరించనుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు ఒక లక్ష చేనేత కుటుంబాలకు, 11,488 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న సామాన్య కార్మికులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.

ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలకు ఏడాదికి సగటున రూ. 8,640 వరకు విద్యుత్ ఖర్చు మిగులుతుంది. అదేవిధంగా పవర్‌లూమ్ యూనిట్ల యజమానులకు ఏడాదికి గరిష్టంగా రూ. 21,600 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, మార్కెట్ ఒడిదుడుకులతో సతమతమవుతున్న నేతన్నలకు ఈ పొదుపు మొత్తం పెట్టుబడిగా మారి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుత ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేతన్నల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేత కార్మికుల సామాజిక భద్రత కోసం పెన్షన్‌ను నెలకు రూ. 4,000కు పెంచడం, సహకార సంఘాల బలోపేతానికి రూ. 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ కేటాయించడం వంటి చర్యలు తీసుకుంది. వీటితో పాటు, ఆధునిక మగ్గాలు, యంత్రాల కొనుగోలుపై ఏకంగా 90 శాతం సబ్సిడీని అందిస్తూ నేత రంగాన్ని ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది.

మొత్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలు నేతన్నల పాలిట వరంగా మారనుంది. కేవలం రాయితీలు ఇవ్వడమే కాకుండా సంప్రదాయ చేనేత వృత్తిని ప్రోత్సహించి నేత కార్మికులు గౌరవప్రదంగా జీవించేలా చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో నేతన్నలకు తీపి కబురు ... నేటి నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు - Tholi Paluku