
ఏపీలో దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకం సిఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి ప్రారంభించారు.
మంగళగిరి నుంచి పెనుమాక వరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించారు. దారి పొడవునా ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. బస్ స్టాండ్‌లోనూ, ప్రయాణ సమయంలోనూ దివ్యాంగులతో ముగ్గురు నేతలు స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. సుమారు 11 కిమీ మేర దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా దివ్యాంగుల జీవనాన్ని సులభతరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు.
ఏపి ప్రభుత్వం ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన 21 కేటగిరీల దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందించనున్నారు. సహాయకులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా సహాయకులతో కలిపి సుమారు 12.75 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే దివ్యాంగుల పింఛన్‌ను రూ.500 నుండి రూ.6,000కు పెంచామని, తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారికి రూ.10,000, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. పింఛన్లకే ఏటా సుమారు రూ.33 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.2,000 వరకు ప్రయాణ ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రోజువారీ పనులు సులభతరం అవుతాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగుల గౌరవాన్ని పెంచే విధంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఉగాది పర్వదినాన్ని మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ లబ్ధిదారులకు ఇరువురినేతలు శుభాకాంక్షలు తెలిపారు.
