
ఏపీలో త్వరలో యూనివర్సల్ హెల్త్ స్కీం : సీఎం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పౌరుడికి సమగ్ర వైద్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విశ్వవ్యాప్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమాను పొందనున్నట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆదివారం నూతనంగా నిర్మించిన శంకర కంటి ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు అందించే వైద్య సహాయం పరిమితిని రూ. 25 లక్షల వరకు విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీర్వాదంతో ప్రారంభించిన ఈ నూతన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి నాలుగు లక్షలకు పైగా కంటి శస్త్రచికిత్సలు, తొమ్మిది లక్షలకు పైగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య బృందం సీఎంకు వివరించింది. ప్రస్తుతం రోజువారీగా సుమారు 3,000 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారని, ఇక్కడ 300 మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు
రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఆరు కోట్లకు పైగా ప్రజల వైద్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే పనులు జరుగుతున్నాయని చెప్పారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టు ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, వైద్య జ్ఞానాన్ని పంచుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు.
