
ఏపీలో తొలి భారీ ఎలక్ట్రిక్ కుకింగ్ ప్రాజెక్టు
సంస్థాగత వంటశాలల్లో ఎల్‌పీజీ వినియోగాన్ని తగ్గించి విద్యుత్ ఆధారిత వంట విధానాన్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ కుకింగ్ డెమాన్‌స్ట్రేషన్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్‌టీయూఏ) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు 2026–27లో ఏపీఎస్‌ఈసీఎం రూ.81.8 లక్షలు కేటాయించనుంది. ఈ నిధులతో వాణిజ్య స్థాయి ఎలక్ట్రిక్ కుకింగ్ పరికరాల కొనుగోలు, ఏర్పాటు, పరీక్షలు, ప్రారంభ ప్రక్రియ చేపట్టనున్నారు.
రోజుకు 2 వేల మందికి వంటలు
జేఎన్‌టీయూఏలోని హంపి హాస్టల్ కేంద్ర వంటశాలలో ప్రస్తుతం ఎల్‌పీజీతో రోజుకు సుమారు 2,000 మంది విద్యార్థులకు భోజనం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఎల్‌పీజీ ఆధారిత వ్యవస్థ స్థానంలో భారీ సామర్థ్యం కలిగిన విద్యుత్ వంట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ పరంగా విద్యుత్ వంట విధానం ఎంతవరకు ప్రయోజనకరమో అంచనా వేయనున్నారు.
ఏటా రూ.1.2 కోట్లకు పైగా ఆదా
ప్రాజెక్టు అంచనాల ప్రకారం ఎల్‌పీజీకి బదులుగా విద్యుత్ వినియోగంతో రోజుకు దాదాపు రూ.33,805 ఇంధన వ్యయం తగ్గనుంది. తద్వారా ఏడాదికి రూ.1.2 కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుపై పెట్టే పెట్టుబడిని సుమారు 310 రోజుల్లోనే తిరిగి రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏటా 250 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గింపు
విద్యుత్ వంట విధానం అమలుతో ఏటా దాదాపు 250 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. తద్వారా కాలుష్య నియంత్రణ, ఇంధన భద్రత, సంస్థాగత వంటశాలల్లో భద్రతకు ప్రయోజనం చేకూరుతుందని ఏపీఎస్‌ఈసీఎం తెలిపింది. ఏపీఎస్‌ఈసీఎం సీఈవో, ఏపీజెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో స్వచ్ఛ ఇంధన మార్పిడిలో విద్యుత్ వంట విధానం కీలకమని అన్నారు. అంతర్జాతీయ ఇంధన ధరలు, సరఫరా అంతరాయాల ప్రభావం నుంచి బయటపడేందుకు ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని తగ్గించడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, విద్యార్థి హాస్టళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర సంస్థాగత వంటశాలల్లో దీనిని విస్తరించేందుకు బెంచ్‌మార్క్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఐదు నెలల్లో పూర్తి
ఈ ప్రాజెక్టును ఐదు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రెండు నెలల్లో హంపి హాస్టల్ వంటశాలలో అవసరమైన సివిల్, విద్యుత్ మౌలిక వసతులను జేఎన్‌టీయూఏ చేపట్టనుంది. అనంతరం మూడు నెలల్లో ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, పరికరాల సరఫరా, ఏర్పాటు, ప్రారంభాన్ని ఏపీఎస్‌ఈసీఎం పర్యవేక్షించనుంది.
