Let's talk: editor@tmv.in
ఏపీలో తొలి ‘అమృత్ భారత్’ స్టేషన్‌గా రాయనపాడు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని

ఏపీలో తొలి ‘అమృత్ భారత్’ స్టేషన్‌గా రాయనపాడు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని

Gaddamidi Naveen
16 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ఆధునికీకరణలో ఒక కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ప్రతిష్టాత్మక 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించిన విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వే స్టేషన్‌ను జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైన మొదటి రైల్వే స్టేషన్‌గా రాయనపాడు నిలిచిందని ఓ ఉన్నత రైల్వే అధికారి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.

సుమారు రూ. 36 కోట్ల వ్యయంతో రాయనపాడు స్టేషన్‌ను విమానాశ్రయాల తరహా సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దారు. దక్షిణ మధ్య రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే - విజయవాడ డివిజన్) అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పి.ఇ. ఎడ్విన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద గుర్తించిన 21 స్టేషన్లలో పనులు పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమైన తొలి స్టేషన్ రాయనపాడు మాత్రమే అని తెలిపారు. రాయనపాడుతో పాటు ఏలూరు, తుని, కాకినాడ టౌన్, నిడదవోలు రైల్వే స్టేషన్లలో కూడా పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, అవి తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నాలుగు స్టేషన్లను కూడా జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత మరిన్ని అమృత్ స్టేషన్లను విడతలవారీగా ప్రారంభిస్తామన్నారు.

విమానాశ్రయాన్ని తలపించేలా రాయనపాడు స్టేషన్

రాయనపాడు స్టేషన్ అభివృద్ధిలో స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ముఖద్వార రూపకల్పన చేపట్టారు. అదే సమయంలో విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, సమృద్ధిగా పార్కింగ్ సదుపాయాలు, ఆధునిక లాంజ్‌లు, మెరుగైన టికెట్ కౌంటర్లు, అత్యాధునిక అంతర్గత అలంకరణలు, ప్రయాణికుల కోసం విస్తృత సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసేందుకు హైస్పీడ్ లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించి అందరికీ సమానంగా స్టేషన్ సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. గతంలో రద్దీగా ఉండే ప్రాంతాలను విస్తరించి కాంక్రీటీకరణ చేయడంతో ప్రయాణికుల సంచారం మరింత సౌకర్యవంతంగా మారింది. అంతర్గత భాగాలను ప్రీమియం ప్రమాణాలతో అభివృద్ధి చేసి మెరుగైన ప్రయాణ అనుభూతి కలిగేలా రూపకల్పన చేశారు. విమానాశ్రయాల తరహా మౌలిక వసతులు, విశాలమైన పార్కింగ్, అందుబాటు సౌకర్యాలు, ఆధునిక ప్రయాణిక సేవలతో పాటు స్థానిక గుర్తింపును కాపాడేలా ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలందరూ తరలిరావాలని ఎడ్విన్ ఆహ్వానించారు. జూలై 17న జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రిటైర్డ్ రైల్వే అధికారులు, రక్షణ సిబ్బంది, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవానికి ముందు ప్లాట్‌ఫారాలపై వాటర్‌ప్రూఫ్ షెల్టర్లు ఏర్పాటు చేయడం సహా మిగిలిన తుది పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు
PMModiRayanapaduRailwayStationAmritBharatStationSchemeIndianRailwaysAndhraPradeshVijayawadaRailwayDevelopmentInfrastructureDevelopment
ఏపీలో తొలి ‘అమృత్ భారత్’ స్టేషన్‌గా రాయనపాడు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని - Tholi Paluku