
ఏపీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున విశాఖపట్నం వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో బస్సులోని 10 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
డీఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ నుంచి నిప్పురవ్వలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చేశారు.
మంటలు బస్సు మొత్తానికి వ్యాపించకముందే ప్రయాణికులందరూ కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధృవీకరించారు. డైనమోలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ ప్రాథమికంగా తెలిపారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా సురక్షితంగా బయటకు తీయగలిగారు.
స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. దాదాపు రూ.80 లక్షల మేర నష్టం జరిగిందని అంచనా వేసినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అధికారులు సాంకేతిక తనిఖీలు చేపట్టారు.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతుండటం, గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులు సజీవ దహనం కావడం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో, రైళ్లలో టికెట్లు దొరకక వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది.
