
ఏపీలో టెక్ పాలన గ్రేట్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతికతను జోడించి అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కొనియాడారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును వివిధ ప్రాజెక్టుల ప్రజెంటేషన్లను గేట్స్ ఆసక్తిగా తిలకించారు. ప్రజల జీవితాల్లో సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు.
డేటాలేక్.. పారదర్శకతకు కేరాఫ్
ముందుగా రాష్ట్రంలోని 'డేటా లేక్' వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానించిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్స్‌కు వివరించారు. దీనివల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతోందని తెలిపారు. 'అవేర్ 2.0' ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, సుమారు 42 రకాల అంశాలను నేరుగా ప్రజలకు రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా 'వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా 921 రకాల పౌర సేవలను ప్రజల అరచేతిలోకి తీసుకువచ్చిన తీరును అధికారులు గేట్స్‌కు వివరించగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందించారు.
సంజీవని ప్రాజెక్టు ‘వెరీ నైస్’
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో అమలవుతున్న 'సంజీవని' డిజిటల్ హెల్త్ ప్రాజెక్టుపై బిల్ గేట్స్ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. "బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ పరీక్షల తర్వాత బాధితులకు ఎలాంటి వైద్యం అందుతోంది? వారి ఆరోగ్య రికార్డులను ఎలా భద్రపరుస్తున్నారు?" అని ఆయన ఆరా తీశారు. ప్రజల జీవనశైలి మార్పులకు ఆహారపు అలవాట్లకు సంబంధించి ఏఐ ద్వారా సూచనలు ఇస్తున్నామని సీఎం వివరించగా.. "దట్స్ వెరీ నైస్" అంటూ గేట్స్ ప్రశంసించారు. అదేవిధంగా గర్భిణీలకు తక్కువ ధరకే డయాగ్నోస్టిక్స్ సేవలు అందాల్సిన అవసరం ఉందన్న గేట్స్ సూచనపై సీఎం సానుకూలంగా స్పందించారు.
బ్లాక్ చైన్‌తో భూ రికార్డులకు భద్రత
మరోవైపు రాష్ట్రంలోని భూ రికార్డుల భద్రత గురించి బిల్ గేట్స్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ ఏపీలో భూములకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు 'బ్లాక్ చైన్' టెక్నాలజీని వాడుతున్నామని వివరించారు. క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్లతో రికార్డులను పారదర్శకంగా ఉంచామని ఏపీ ఏఐ సెర్చ్ బార్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అదేవిదంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సీఎం వివరించారు.
అమరావతి.. గ్రీన్ అండ్ బ్లూ సిటీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలను కూడా బిల్ గేట్స్ పరిశీలించారు. నగర నిర్మాణంలో 30 శాతం మేర నీటి వనరులు (బ్లూ), పచ్చదనం (గ్రీన్) కోసం కేటాయించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి రూపకల్పనలో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్న తీరుపై "గ్రేట్ వర్క్" అంటూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ధాత్రిరెడ్డి, మలికా గార్గ్, ప్రఖర్ జైన్ తదితరులు వివిధ ప్రాజెక్టులపై బిల్ గేట్స్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
