Let's talk: editor@tmv.in
ఏపీలో ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ

ఏపీలో ఘనంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ

Pinjari Chand
14 ఆగస్టు, 2026

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం పట్టణంలో గురువారం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని 330 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై నాలుగు మాడ వీధుల మీదుగా సాగింది. నవజ్యోతి మిశ్రా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

‘వికసిత్‌ భారత్‌’ కోసం యువత ముందుకు రావాలి

ఈ సందర్భంగా నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ‘యూత్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ అనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారిలో దేశభక్తి, అభివృద్ధి పట్ల బాధ్యతను పెంపొందించేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిరోజూ ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, శుక్రవారం సైకిల్‌ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఎన్‌టీఆర్‌ జిల్లాలోనూ భారీ ర్యాలీ

ఎన్‌టీఆర్‌ జిల్లాలోనూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం భారీ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది. ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ జి. లక్ష్మీశా మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఈ భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

భారత్‌ స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమష్టి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు స్వాతంత్య్ర వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో దేశభక్తి, పౌర బాధ్యత, దేశాభివృద్ధి పట్ల చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.