Let's talk: editor@tmv.in
ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Pinjari Chand
8 సెప్టెంబర్, 2026

రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 61,92,396 మంది పింఛనుదారులకు నెలకు రూ.2,694 కోట్ల మేర పింఛన్లు అందుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హులా? కాదా అని ధ్రువీకరించిన తరువాత దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.

26నాటికి ఆమోద ప్రక్రియ

సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ-కేవైసీ ధ్రువీకరణ చేపడతారు. 17 నుంచి 21 వరకు సాధారణ అర్హత పరిశీలన, 22 నుంచి 24 వరకు భౌతిక, శాఖాపరమైన ధ్రువీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు చేస్తారు. సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో సెర్ప్‌ ద్వారా బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

ఈ పత్రాలు తప్పనిసరి

అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్‌, రేషన్‌ కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం అవసరం. వితంతువులు భర్త మరణ ధ్రువపత్రం, దివ్యాంగులు 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్‌ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే సదరం ధ్రువపత్రం సమర్పించాలి. చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, ట్రాన్స్‌జెండర్లు తదితరులు తమ కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలను అందజేయాల్సి ఉంటుంది.

రూ.73,508 కోట్లు ఖర్చు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెప్టెంబర్‌ 1, 2026 వరకు పింఛన్ల కోసం రూ.73,508 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, పలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రూ.10,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15,000 వరకు పింఛన్లు అందుతున్నాయి. ఇప్పటివరకు పింఛన్‌ పొందని అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - Tholi Paluku