
ఏపీలో కూటమి ఎమ్మెల్యేలకు చట్టాలు వర్తించవా?: వరుదు కళ్యాణి
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళా ఉద్యోగి చేసిన తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడంపై వరుదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా నిందితుడు పట్టుబడ్డప్పటికీ పోలీసులు వెనుకడుగు వేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు తప్పులు చేసినా వారిపై చట్టాలు వర్తించవా? కేసులు పెట్టరా? చర్యలు తీసుకోరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేసు ఎందుకు నమోదు చేయలేదు?
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. ఏడాదిన్నరగా అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నానని బాధిత మహిళ ఆడియో, వీడియో ఆధారాలతో బయటకు వచ్చినప్పటికీ, నిందితుడిపై ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. హోంమంత్రిగా మహిళ ఉన్నప్పటికీ స్పందన లేకపోవడం మరింత బాధాకరమని పేర్కొన్నారు.
పార్టీ నాయకులతో కమిటీ ఎందుకు?
ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో కమిటీ వేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, న్యాయస్థానాలు ఉన్నప్పుడు పార్టీ కమిటీ అవసరం ఏమిటని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న ఉద్దేశం కాకుండా, ఆమెను నిందితురాలిగా మార్చే కుట్రలో భాగంగానే ఈ కమిటీ ఏర్పాటు చేశారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
మాటలకే పరిమితమా?
మహిళకు అన్యాయం జరిగితే చివరి రోజు అవుతుందని హెచ్చరించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎక్కడున్నారని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. తాను తప్పు చేసినా, ఇతరులు తప్పు చేసినా తలలు తీసే చట్టం కావాలని చెప్పిన పవన్ కళ్యాణ్, తన పార్టీ ఎమ్మెల్యే విషయంలో బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. మహిళల భద్రతపై గొప్ప ప్రసంగాలు చేసిన హోంమంత్రి అనిత కూడా మౌనం వహించడం దారుణమన్నారు.
మంత్రి కుమారుడిపై కూడా కేసు పెట్టాలి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పేకాట ఆడుతున్న వీడియోలు వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. గతంలో మహిళ ఫిర్యాదు చేసినా, నిందితుడిని వదిలేసి ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు పెట్టిన ఘటనలను ప్రస్తావించారు. కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
వైయస్ జగన్ పుట్టినరోజు జరిపితే కేసులా?
వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినా కేసులు పెట్టిన ప్రభుత్వం, మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న కూటమి నేతలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, స్పీకర్, మహిళా కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి కల్పిస్తేనే ఇలాంటి దారుణాలు ఆగుతాయని ఆమె స్పష్టం చేశారు.
