
ఏపీలో కుప్పకూలిన ప్రజారోగ్యం.. కూటమి పాలనపై జగన్ ధ్వజం
రాష్ట్రంలో సామాన్యుడి ప్రాణాలకు రక్షణ కరువైంది. మనిషి జీవించడానికి కనీస అవసరాలైన పాలు, నీళ్లు ఇప్పుడు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఈ దారుణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆయన 'ఎక్స్' వేదికగా ధ్వజమెత్తారు. "ప్రజలు బ్రతకడానికి తాగే పాలు, నీళ్లు కూడా సురక్షితం కాకపోవడం దారుణం. కలుషిత నీరు, కల్తీ పాలు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం" అని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో 'విష' వలయం.. విద్యార్థుల అవస్థలు
ఇక కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్టగా నిలుస్తోంది. ఇక్కడ 16 మంది విద్యార్థినులు డయేరియా బారిన పడగా ఐదుగురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గతంలో ఇదే పాఠశాలలో కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థినులు మరణించినా దాదాపు 100 మంది ఆస్పత్రి పాలైనా ప్రభుత్వం ఎటువంటి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 14 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో దాదాపు 25 ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల వల్ల 15 జిల్లాలకు చెందిన సుమారు 900 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టళ్లలో నెలకొన్న అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి సరఫరాపై జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించి రాష్ట్ర పరిస్థితిని ఎండగట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే భావి భారత పౌరులైన విద్యార్థుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
విజృంభిస్తున్న డయేరియా
మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో డయేరియా విజృంభణ మృత్యుఘోషను వినిపిస్తోంది. గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం వంటి ప్రాంతాల్లో వందలాది మంది అస్వస్థతకు గురవడమే కాకుండా, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా శ్రీకాకుళంలో గత వారం కలుషిత నీటి కారణంగా ఐదుగురు మృత్యువాత పడగా, 200 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నీటి నాణ్యతను పరీక్షించడంలో, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని దీనికితోడు తాజాగా రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణం కావడం అనేది ఒక చిన్నపాటి లోపం కాదని ఇది ఆహార భద్రత పర్యవేక్షణ యంత్రాంగం పూర్తిగా నిద్రపోతోందనడానికి నిదర్శనమని జగన్ విమర్శించారు. పరిపాలనపై ముఖ్యమంత్రికి పట్టు లేకపోవడం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ పెద్దలంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారని ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ జగన్ చేశారు.
