
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ యుద్ద పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చే గ్యాస్ సరఫరా మార్గాలను పరిశీలిస్తూ, రోజువారీ అవసరాలకు తగిన నిల్వలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రానికి హెచ్పీసీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్–చర్లపల్లి పైపులైన్, అలాగే విశాఖలోని హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీ సంస్థల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ సరఫరా వ్యవస్థలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. అవసరమైతే వాణిజ్య అవసరాలకు కేటాయించే గ్యాస్‌ను ప్రాధాన్యతల ప్రకారం పునర్వ్యవస్థీకరించి గృహ వినియోగదారులకు ముందుగా అందించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రానికి దాని ప్రభావం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టి గ్యాస్ పక్కదోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సరఫరా గొలుసును నిరంతరం పరిశీలిస్తూ ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
అలాగే గ్యాస్ కొరత ఉందనే వదంతులను వ్యాప్తి చేస్తూ ధరలు పెంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మి ప్రజలు భయపడవద్దని, ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
