Let's talk: editor@tmv.in
ఏపీలో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం

ఏపీలో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం

Panthagani Anusha
14 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర చేపల వేటపై వార్షిక నిషేధం అమల్లోకి రానుంది. సముద్ర జీవ వనరుల సంరక్షణ, చేపల సంతానోత్పత్తి వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు సముద్రంపై వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధ కాలంలో మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు వేటకు వెళ్లడంపై పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని మత్స్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

సముద్ర వేటపై విధిస్తున్న ఈ ఆంక్షలను మత్స్యకారుల అందరూ విధిగా పాటించాలని అధికారులు కోరారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వేటకు వెళ్తే వారిపై 'ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1995' ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పడవలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సముద్ర గర్భంలో చేపల సంతతి పెరిగేందుకు ఈ రెండు నెలల విరామం ఎంతో కీలకమని దీనివల్ల భవిష్యత్తులో వేట మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

మత్స్యకార భరోసా: రూ. 20 వేల ఆర్థిక సాయం

వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అర్హులైన ప్రతి మత్స్యకారునికి రూ. 20,000 చొప్పున ఆర్థిక భృతిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 2025–26 సీజన్‌కు సంబంధించి నమోదు చేసుకున్న పడవలకు అందులో పనిచేసే సిబ్బందికి మాత్రమే ఈ ప్రయోజనం చేకూరనుంది. లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలు, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులతో పాటు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

పడవల కొలతలపై స్పష్టమైన మార్గదర్శకాలు

ఈ ఏడాది ఫిషింగ్ పడవల పొడవు, సామర్థ్యంపై ప్రభుత్వం కీలక నిబంధనలు విధించింది. 18 మీటర్ల లోపు ఉన్న మెకనైజ్డ్ పడవలు గరిష్టంగా 10 మీటర్ల ఆపరేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా మోటరైజ్డ్ పడవలు 6 మీటర్లు, నాన్-మోటరైజ్డ్ పడవలు 3 మీటర్ల లోపు పొడవు ఉండాలని నిర్ణయించారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో అధికారులు ఇప్పటికే పడవ యజమానులు సిబ్బంది వివరాల నమోదును ప్రారంభించారు. కేవలం రిజిస్టర్ అయిన పడవలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని మత్స్యశాఖ స్పష్టం చేసింది.