Let's talk: editor@tmv.in
ఏపీలో అర్బన్ ఇన్‌ఫ్రా ప్రోగ్రామ్

ఏపీలో అర్బన్ ఇన్‌ఫ్రా ప్రోగ్రామ్

Dantu Vijaya Lakshmi Prasanna
25 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నమూనా కింద రూ. 66,523 కోట్ల పట్టణ మౌలిక సదుపాయాల వేగవంత కార్యక్రమాన్ని ప్రకటించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం 2029 నాటికి 12 ప్రాధాన్యతా రంగాలలో ఈ పెట్టుబడి మొత్తాన్ని అంచనా వేసింది.

"రూ. 66,523 కోట్ల పట్టణ మౌలిక సదుపాయాల వేగవంత మిషన్‌ను పీపీపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది" అని ఏపి ప్రభుత్వం ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదలచేసింది. .

గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతి అభివృద్ధిని మినహాయించి, ఈ ప్రాధాన్యతా రంగాలలో స్మార్ట్ వాటర్ సిస్టమ్స్, ఆధునిక రవాణా మార్గాలు, సమగ్ర చలనశీలత (ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ), సుస్థిర గృహనిర్మాణం, నెక్స్ట్-జనరేషన్ పట్టణ యుటిలిటీలు ఉన్నాయి. ఈ చర్యలు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి రూ. 2.8 లక్షల కోట్ల మేర దోహదపడతాయని భావిస్తున్నారు.

పీపీపీ నేతృత్వంలోని పట్టణ పరివర్తన ప్రణాళికను వేగవంతం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సంవత్సర బడ్జెట్‌లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా రూ. 2,000 కోట్లను కేటాయించింది.

ఈ ప్రాజెక్టుల ద్వారా 2.3 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇందులో 45 శాతం నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి, 35 శాతం మహిళలకు అభివృద్ధి చెందుతున్న పట్టణ సేవలు, సాంకేతికతలలో భాగస్వామ్యం కల్పించడంపై దృష్టి సారించారు.

ఈ ప్రణాళికలోని ముఖ్య భాగాలలో, ఐదు స్మార్ట్ సిటీలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత వ్యవస్థలతో అభివృద్ధి చేయడం, 2,500 కి.మీ. రహదారులను ఆధునీకరించడం, 15 పట్టణ రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ నిబంధనలను పాటించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

వ్యూహాత్మక పీపీపీ ఫ్రేమ్‌వర్క్‌లు, సాంకేతికత ఆధారిత పాలన మరియు వినూత్న ఆర్థిక వ్యూహాల మద్దతుతో ఎనిమిది ఆర్థిక జోన్‌ల కోసం రూ. 35,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఈ ప్రకటన తెలిపింది.

రూ. 10,000 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రూ. 400 కోట్ల క్రెడిట్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇనిషియేటివ్ సహా కేంద్ర పథకాల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందాలని దక్షిణ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎమ్ ఏ & యు డి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ గృహనిర్మాణం, పట్టణ చలనశీలత, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్య మౌలిక సదుపాయాలు వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి (వేస్ట్-టు-ఎనర్జీ) వరకు విస్తరించిన రాష్ట్రంలోని 33 పీపీపీ నమూనా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.

నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, విజయవాడ తిరుపతి క్లస్టర్‌లలో రూ. 1,254 కోట్ల వ్యయంతో కూడిన వేస్ట్-టు-ఎనర్జీ ప్రాజెక్టులు స్థిరంగా పురోగమిస్తున్నాయని, అలాగే ఎంఐజీ హౌసింగ్, రుషికొండ భూముల నగదీకరణ, ఐకానిక్ టవర్ వంటి ప్రధాన కార్యక్రమాలు చురుకైన బిడ్డింగ్ దశలోకి ప్రవేశించాయని ఈ సందర్భంగా సురేష్ కుమార్ తెలిపారు.