
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోంది: బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అవినీతి, భూకబ్జాలు, అరాచకాలు పెచ్చరిల్లి పోయాయని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్లు పూర్తికాకముందే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందని, ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని బొత్స ఆరోపించారు. పౌర హక్కులను అణచివేస్తూ మీడియా స్వేచ్ఛను హరిస్తూ భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. "రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘన పరిపాటిగా మారింది. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తూ, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు కుప్పకూలాయి..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేదే లేకుండా పోయిందని పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రక్షణ కల్పించాల్సిన వారే భయపెట్టడం దారుణమని అన్నారు. కూటమి నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు తమ అనుచరులకు కట్టబెడుతున్నారని బొత్స ఆరోపించారు. అదేవిధంగా అవినీతి రాజ్యమేలుతోందని, దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు గడిచిన వైకాపా పాలనను గుర్తు చేస్తూ.. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగింది. ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం. కానీ నేడు ఆ సంక్షేమ వ్యవస్థలన్నింటినీ కూటమి ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది అని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వైకాపా నిరంతరం పోరాడుతుందని రాష్ట్రాభివృద్ధి చెందాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ అరాచకాలపై కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
