Let's talk: editor@tmv.in
ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నేడు శంకుస్థాపన

ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నేడు శంకుస్థాపన

Panthagani Anusha
17 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో, దేశంలోనే అతిపెద్ద 'గ్రీన్ అమోనియా' ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకారం చుట్టనున్నారు. కాకినాడ కేంద్రంగా రూ.13,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న 'ఏఎమ్ గ్రీన్ అమోనియా' ప్లాంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది అనుమతులు పొందిన గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన 'ఏఎమ్ గ్రీన్' సంస్థ, రికార్డు స్థాయిలో ఏడాది కాలంలోనే పనులను పట్టాలెక్కించింది. కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్సిఎల్) పాత ప్లాంట్‌ను ఆధునికీకరించి 495 ఎకరాల్లో ఈ అత్యాధునిక గ్రీన్ అమోనియా యూనిట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బొగ్గు, చమురు వినియోగం లేకుండా కేవలం గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చనుంది.

2,600 మందికి ఉద్యోగాలు

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని. ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్లాంట్, 2027 చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనికి తోడు, సుమారు రూ. 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను సంస్థ ఇక్కడే నిర్మిస్తుండటం గమనార్హం.

గ్లోబల్ హబ్‌గా కాకినాడ

కాకినాడ పోర్టుకు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉండటం ఎగుమతులకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే జర్మనీకి చెందిన 'యూనిపర్ ఎస్ఈ' సంస్థతో ఏఎమ్ గ్రీన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 కేటీపీఏ అమోనియాను జర్మనీకి సరఫరా చేయనున్నారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌కు చెందిన జీఐసీ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుండటంతో ప్రపంచ ఇంధన పటంలో కాకినాడ కీలక కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 10.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరిన కాకినాడ చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.