Let's talk: editor@tmv.in
ఏపీపై ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ఏపీపై ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Thaduri Lalitya
26 అక్టోబర్, 2025

రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ‘మొంథా’ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ సన్నద్ధత చర్యలపై సమీక్ష చేపట్టారు.

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అక్టోబర్ 26 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నివేదికల్లో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.

శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని, 80 నుండి 100 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక తుఫాన్ రక్షణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నీటిమట్టాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి శాస్త్రీయంగా నీటిని విడుదల చేయాలని ఆయన సూచించారు. రియల్ టైమ్ సమాచారం జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని, కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అలాగే తాగునీరు, విద్యుత్, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు అంతరాయం లేకుండా కొనసాగించేలా చూడాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, నష్ట నివారణ చర్యలు సమగ్రంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఏపీపై ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ - Tholi Paluku