Let's talk: editor@tmv.in
ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం: సీఎం

ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం: సీఎం

Panthagani Anusha
23 మార్చి, 2026

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాష్ట్ర ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ప్రభావం చూపుతున్నాయని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్ల ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రసంగించారు. గ్లోబల్ సంక్షోభాలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నప్పటికీ వ్యూహాత్మక అడుగులు వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్థిక సంస్కరణలు - ఐటీ విప్లవం

1991లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ప్రగతి వైపు నడిపించాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆనాడు 'నాలెడ్జ్ ఎకానమీ' లక్ష్యంగా ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతే నేడు హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. సైబర్ టవర్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాల రాక హైదరాబాద్ ఎకో-సిస్టమ్‌ను బలపరిచాయని ఐఎస్‌బీ వంటి విద్యాసంస్థలు ఆ పురోగతిని వేగవంతం చేశాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ద్వారా ఫార్మా రంగాన్ని ప్రోత్సహించడం వల్లనే కోవిడ్ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించగలిగామని తెలిపారు.

కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరణ

రాష్ట్ర విభజన తర్వాత ఎంతో శ్రమించి నిర్మించిన వ్యవస్థలు 2024కి ముందున్న ఐదేళ్ల పాలనలో పూర్తిగా నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సమతూకం చేస్తూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని పారదర్శక పాలన ద్వారా తిరిగి పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

భవిష్యత్ సాంకేతికతలే గమ్యం

రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్ టెక్నాలజీలు వృద్ధిని శాసిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు 'డ్రోన్ సిటీ' అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించామని, దక్షిణ భారతదేశంలోనే ఏపీని గ్రీన్ ఫ్యుయల్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా సామాన్యుడికి తక్కువ ధరకే విద్యుత్ అందించడం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పాలనలో 'ఏఐ' ప్రాధాన్యం

ఇక టెక్నాలజీని సామాన్యుడి చెంతకు చేర్చడంలో తన ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యంలో ఏఐ సాంకేతికతను వాడటం ద్వారా భక్తులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని ప్రసాదం తయారీలో నాణ్యతను నిర్ధారించేందుకు అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల్‌పీజీ సమస్యలను అధిగమించేందుకు పైపుల ద్వారా సహజ వాయువు (పిఎన్జి) సరఫరాను విస్తృతం చేస్తామని దీనివల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.