
ఏపీజే అబ్దుల్ కలాం జయంతిలో పాల్గొన్న శుభాంశు శుక్లా
‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని జీఎంఆర్ అరినాలో బుధవారం కలాం స్పేస్ కన్వెన్షన్–2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పిల్లల ఉత్సాహం, శక్తి, ప్రతిభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన శక్తి. ఇక్కడ ఉండటం నిజంగా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. హైదరాబాద్ వాసులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు.వారికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఈ కార్యక్రమం యువతను ప్రేరేపించడానికి నిర్వహించబడిందని తెలిపారు. 6,000కు పైగా విద్యార్థులు ప్రత్యక్షంగా, 30,000కి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ లో పాల్గొన్నారు. శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను విద్యార్థులకు వివరిస్తూ వీడియోలను ప్రదర్శించారు. కార్యక్రమంలో స్టార్టప్ ఫౌండర్స్, విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లు ప్రసంగించారు. ఇది విద్యార్థులను భారతదేశం అంతరిక్ష, రక్షణ సాంకేతికతలలో ముందడుగు వేయడం, నూతన ఆవిష్కరణలు చేసి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడానికి ప్రేరేపించడమే లక్ష్యంగా కార్యక్రమం సాగింది.
డాక్టర్ ఏపీజే కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడు రామేశ్వరం లోని ఓ పేద కుటుంబంలో జన్మించారు. ఎస్ఎల్వీ-III, అగ్ని, పృథ్వీ మిస్సైళ్ళను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ‘ఇగ్నిటెడ్ మైండ్స్’ ‘ఇండియా–2020 వంటి పుస్తకాల ద్వారా యువతను ఆకర్షించారు. 2015 జూలై 27న ఆయన మరణించారు.
