Let's talk: editor@tmv.in
ఏపీకి వర్ష సూచన..ఐదు రోజుల పాటు అప్రమత్తం

ఏపీకి వర్ష సూచన..ఐదు రోజుల పాటు అప్రమత్తం

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవించనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఒకవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరోవైపు భానుడి భగభగలతో కూడిన ఉక్కపోత రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 10 నుంచి 12 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తన నివేదికలో పేర్కొంది.

వాతావరణ మార్పులకు గల కారణాలను విశ్లేషిస్తూ అంతర్గత ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ఉత్తర-దక్షిణ ట్రఫ్ (ద్రోణి) ప్రస్తుతం చురుగ్గా ఉందని అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత గాలి ప్రసరణ కూడా రాష్ట్ర వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఇక ప్రాంతాల వారీగా అంచనాలను గమనిస్తే ఏప్రిల్ 10న తీర ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే వీలుంది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 11న కూడా ఇదే తరహా పరిస్థితులు ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కొనసాగుతాయి. అయితే ఏప్రిల్ 13 నుంచి వర్షాల ప్రభావం క్రమంగా తగ్గి రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగనుంది.

ముఖ్యంగా ఏప్రిల్ 13 నుంచి 16 వరకు వర్షాలు తగ్గుముఖం పట్టినా గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు వాతావరణ పరిస్థితులను గమనించాలని కోరారు. ఉరుములు సంభవించే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల చెంత ఉండకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.