
ఏపీకి రేమండ్ గ్రూప్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రూ. 943 కోట్ల పెట్టుబడి పెట్టాలన్న రేమండ్ గ్రూప్ ప్రతిపాదనను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని గుడిపల్లి, టేకులేడులో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, ఆటో కాంపొనెంట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ రెండు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే దాదాపు 5 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం రేమండ్ గ్రూప్ ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.
రేమండ్ గ్రూప్ అనంతపురం జిల్లాలో రెండు పరిశ్రమలను స్థాపించనుంది. అందులో ఒకటి గుడిపల్లిలో , మరొకటి టేకులేడులో. గుడిపల్లిలో ఆటో కాంపొనెంట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినుంది. ప్రభుత్వం దాదాపు 30 ఎకరాల భూమిని కేటాయించింది. రేమండ్ గ్రూప్ దాదాపు రూ. 430 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడ దాదాపు 4096 ఉద్యాగాలు లభిస్తాయి. మరోవైపు టేకులేడులో, గుడిపల్లిలో రేమండ్ గ్రూప్ కు చెందిన జేకే మైని ఏరోస్పేస్ సంస్థ ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదిస్తోంది. దాదాపు రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ తయారీ కేంద్రంలో 1400 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం 47.28 ఎకరాల భూమి కేటాయించడానికి ఆమోదం తెలపనుంది. ఫ్యాక్టరీ నిర్మాణం మార్చి 2026లో, వాణిజ్య ఉత్పత్తి మే 2027లో ప్రారంభం కానుంది.
జేకే మైని ప్రెసిషన్ టెక్నాలజీ సంస్థ రేమండ్ గ్రూప్ అనుబంధ సంస్థ. 1973లో దీనిని ప్రారంభించారు. 2004లో కంపెనీ ఏరోస్పేస్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ కంపెనీ వివిధ రకాల విడిభాగాలను తయారు చేస్తుంది. ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా పనిచేస్తోంది. కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, అనుమతులు సులభతరం చేయడం, వేగవంతంగా అనుమతులు ఇవ్వడం వంటి వ్యాపార అనుకూల నిర్ణయాలు పెట్టుబడులు రావడానికి కారణం అవుతున్నాయి.
