Let's talk: editor@tmv.in
ఏపీకి పెట్టుబడుల వెల్లువ: 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీకి పెట్టుబడుల వెల్లువ: 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల పెట్టుబడులతో కూడిన 31 భారీ ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని సుమారు 1,11,278 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సౌర శక్తితో వెలుగులు - ఐటీ రంగంలో కొత్త శకం

రాష్ట్రాన్ని ఇంధన, సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా అమరావతి 'క్వాంటం వ్యాలీ'లో మూడు ప్రముఖ సంస్థల స్థాపనకు ఎస్‌ఐపీబీ ఆమోదముద్ర వేసింది. అక్కడ నిర్మించ తలపెట్టిన క్వాంటం టవర్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాయలసీమ ప్రాంతంలోని సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. దీనికోసం అవసరమైన విద్యుత్ ప్రసరణ మౌలిక సదుపాయాలను వెంటనే అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.

తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి

ఇక శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపురం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిదంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే సహాయ సహకారాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు.

భద్రతపై కఠినం.. గడువులోగా నిర్మాణం

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. ముఖ్యంగా పటాకుల తయారీ, డెయిరీ వంటి ప్రమాదకర యూనిట్లలో అంతర్జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ మార్గదర్శకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. "ఆమోదం పొందిన ప్రాజెక్టులు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభం కావాలి. ప్రతి ఎస్‌ఐపీబీ సమావేశంలోనూ వీటి పురోగతిని నేనే స్వయంగా సమీక్షిస్తాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా గత 22 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పారిశ్రామిక ప్రగతి గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా రూ. 9.36 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి కాగా వీటి ద్వారా దాదాపు 9.60 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇక విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 802 ప్రాజెక్టుల ద్వారా రూ. 20.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లో 23.55 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.