
ఏపీకి పెట్టుబడుల వెల్లువ... రూ. 9.26 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఏకంగా రూ. 9.26 లక్షల కోట్ల విలువైన 260 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విశేషమేమిటంటే వీటిలో సుమారు 80 శాతం ప్రాజెక్టుల పనులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ.. గ్లోబల్ డేటా హబ్
విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి డేటా సెంటర్ హబ్‌గా మార్చే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆదాని ఇన్‌ఫ్రా ఇండియా, రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థలకు సేల్ డీడ్ అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.
అదేవిధంగా ఐటీ రంగంలో విశాఖకు మరిన్ని హంగులు చేరనున్నాయి. క్రెడెన్స్ రియాల్టీ రూ. 387 కోట్లతో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనుండగా దీని ద్వారా 6,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ రూ.425 కోట్లతో తన క్యాంపస్‌ను నిర్మించనుంది. శ్రీ టెక్ డేటా లిమిటెడ్ రూ. 1,800 కోట్లతో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి డేటా కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనుంది.
సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ అడుగు
రాష్ట్రంలో హైటెక్ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా రూ.10,240 కోట్ల భారీ వ్యయంతో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 60 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
మరోవైపు తయారీ రంగంలో పీజీ టెక్నో ప్లాస్ట్ సంస్థ రూ. 1,305 కోట్లతో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల 2,000 మందికి ఉపాధి కలగనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో స్పెషాలిటీ కెమికల్స్ రూ. 2,500 కోట్లతో లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది.
ఉపాధి కల్పనే ధ్యేయంగా..
ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ద్వారా రూ. 627 కోట్ల పెట్టుబడితో ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధి జరగనుంది దీని ద్వారా రికార్డు స్థాయిలో 12,500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఇక రాజధాని అమరావతిలో నిర్మించనున్న 'క్వాంటమ్ వ్యాలీ'లో క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థ రూ. 108 కోట్లతో పరిశోధన తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది.
కాగా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని యువతకు సొంత రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
