
ఏపీకి జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.2,447.9 కోట్ల నిధులు
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమాల అమలుకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,447.9 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ.1,468.7 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.979.1 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రాధాన్యతా క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్రం సూచించిందని మంత్రి తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం కింద మానవ వనరులు, సిబ్బంది వేతనాల కోసం అత్యధికంగా రూ.1,008.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
మందులు, వ్యాక్సిన్లు, రియాజెంట్ల కోసం రూ.411.1 కోట్లు గ్రాంట్ ఇన్ కైండ్‌గా కేటాయించారు. టీబీ నియంత్రణ, వ్యాధుల గుర్తింపు, చికిత్సకు రూ.116.5 కోట్లు, ఉచిత డయాగ్నస్టిక్స్‌కు రూ.114.5 కోట్లు, సాధారణ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి రూ.97.6 కోట్లు కేటాయించారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లకు రూ.94.2 కోట్లు, 108 అంబులెన్స్ సేవలకు రూ.92.9 కోట్లు, జననీ శిశు సురక్ష కార్యక్రమానికి రూ.88.6 కోట్లు, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌కు రూ.79.8 కోట్లు, అనీమియా ముక్త్ భారత్‌కు రూ.77.5 కోట్లు కేటాయించారు. ఉచిత మందులకు రూ.77.5 కోట్లు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌కు రూ.72.2 కోట్లు, నవజాత శిశు సంరక్షణకు రూ.70.6 కోట్లు, వైద్య పరికరాల నిర్వహణకు రూ.69.9 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ నియంత్రణకు రూ.68.2 కోట్లు, ఉచిత డయాలసిస్‌కు రూ.67.7 కోట్లు కేటాయించారు.
కొత్తగా ఐదు కార్యక్రమాలకు నిధులు
కొత్తగా చేపట్టనున్న ఐదు ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాలకు రూ.75.5 కోట్లు కేటాయించారు. గుండెపోటు అత్యవసర చికిత్సలో ఉపయోగించే స్టెమీ మందులకు రూ.26.6 కోట్లు, కేర్ కోఆర్డినేషన్, టెలీ కన్సల్టేషన్ గదులకు రూ.25.8 కోట్లు, టెలీ కన్సల్టేషన్ల కోసం డెస్క్‌టాప్ కంప్యూటర్లకు రూ.11 కోట్లు, అత్యవసర ట్రామా కేర్ పరికరాలకు రూ.7.2 కోట్లు, బర్న్ యూనిట్ పరికరాలకు రూ.4.7 కోట్లు కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు, రక్త సేవలు, కుష్ఠు వ్యాధి, వైరల్ హెపటైటిస్ నియంత్రణ, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవల కోసం కూడా నిధులు కేటాయించారు. మొత్తం రూ.2,447.9 కోట్ల రిసోర్స్ ఎన్వలప్‌లో రూ.411.1 కోట్లు గ్రాంట్ ఇన్ కైండ్, రూ.120.7 కోట్లు మౌలిక వసతుల నిర్వహణకు కేటాయించడంతో నికర నగదు లభ్యత రూ.1,916.1 కోట్లుగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.1,175 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులను ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా వినియోగిస్తామని సత్యకుమార్ తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, టెలీ కన్సల్టేషన్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
