Let's talk: editor@tmv.in
ఏపీకి ఆర్సెలర్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్..పరిశ్రమలు కోల్పోతున్న ఒడిశా: బీజేడీ ఎంపీ

ఏపీకి ఆర్సెలర్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్..పరిశ్రమలు కోల్పోతున్న ఒడిశా: బీజేడీ ఎంపీ

Panthagani Anusha
31 మార్చి, 2026

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలకమైన ‘ఆర్సెలర్‌మిట్టల్–నిప్పాన్ స్టీల్’ ప్రాజెక్టు తరలింపు వ్యవహారం ఇప్పుడు ఒడిశా రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. తొలుత ఒడిశాలో ఏర్పాటు కావాల్సిన ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడంపై బిజు జనతా దళ్ ( బీజేడీ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ పరిణామం రాష్ట్రానికి "బాధాకరమైనది మరియు సిగ్గుచేటు" అని బిజెడి ఎంపీ సస్మిత్ పాత్రా పేర్కొన్నారు.

ఒప్పందాలు ఏమయ్యాయి?

ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాత్రా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నేపథ్యాన్ని గుర్తుచేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ జపాన్ పర్యటనలో భాగంగా నిప్పాన్ స్టీల్‌తో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. 2021లోనే కేంద్రపారా జిల్లాలో రూ.50,000 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 12 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగారాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని కానీ ఇప్పుడు ఆ ప్లాంట్‌ను పొరుగు రాష్ట్రానికి తరలించడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఖనిజ సంపద దోపిడీపై ఆందోళన

రాష్ట్ర వనరులను ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తరలించడాన్ని పాత్రా తప్పుబట్టారు. ఒడిశాకు చెందిన ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)ను స్లరీ పైప్‌లైన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తరలించి అక్కడ ఉక్కు తయారు చేయాలనుకోవడం అత్యంత తీవ్రమైన విషయం. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు ఇలా అన్నీ రాష్ట్రం దాటి వెళ్లిపోతే ఇక్కడ యువతకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. ఆర్సెలర్‌మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్‌ను ఉద్దేశిస్తూ "ఉక్కు తయారు చేయాలనుకుంటే మా గడ్డపైనే చేయాలి మా ఖనిజాలను తరలించడం ఆపాలి అని డిమాండ్ చేశారు.

ఏపీలో శంకుస్థాపన.. వ్యూహాత్మక అడుగులు

మరోవైపు ఆర్సెలర్‌మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద తమ సమగ్ర ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన పూర్తి చేసింది. తీర ప్రాంతం అందుబాటులో ఉండటం స్లరీ పైప్‌లైన్ సౌకర్యం వల్ల రవాణా ఖర్చులు తగ్గి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలమని కంపెనీ వెల్లడించింది. దేశంలోని అత్యంత సంపన్నమైన ఇనుప ఖనిజ నిల్వలకు ఈ ప్రాంతం సులభంగా అనుసంధానమై ఉంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

మారిన రాజకీయ సమీకరణాలు

2024 ఎన్నికల్లో 21 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పారిశ్రామిక వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. 2025 ఆగస్టులో భువనేశ్వర్ ఇన్ఫో వ్యాలీలో రెండు సెమీకండక్టర్ యూనిట్లను కేంద్రం ఆమోదించింది. అదేవిదంగా 2026-27 బడ్జెట్‌లో 'రేర్ ఎర్త్ కారిడార్ల'లో ఒడిశాకు చోటు దక్కడం సానుకూల పరిణామమే అయినప్పటికీ చేతికి చిక్కిన భారీ ఉక్కు పరిశ్రమ చేజారిపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.