
ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీల భర్తీకి కసరత్తు
ఏపి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ఛాంబర్లో ఏపీఎస్ఆర్టీసీపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్షలో ఉద్యోగుల ప్రమోషన్లు, నియామకాలు, బకాయిల చెల్లింపులు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై మంత్రి అధికారులతో చర్చించారు.
ఈ సమీక్షతో 2025–26 సంవత్సరానికి సంబంధించి అర్హులైన 7,514 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. ఫిబ్రవరి 20 లోపు ఎంప్యానెల్ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ స్థాయిల్లో సీనియారిటీ జాబితాల ఆధారంగా ఈ ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
7,673 కొత్త పోస్టుల భర్తీ:
సంస్థలో పెరుగుతున్న పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2020లో 51,488 మందిగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 44,131కి తగ్గిందని, రాబోయే మూడేళ్లలో మరిన్ని రిటైర్మెంట్లు ఉన్నాయని అధికారులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.
వైద్య కారణాల రిటైర్మెంట్ & పరిహారం
ఈ సమీక్షలో, వైద్య కారణాలతో పదవీ విరమణ పొందిన 682 మంది ఉద్యోగుల సమస్యలపై మంత్రి చర్చించారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించగా, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.96.90 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
కారుణ్య నియామకాలు - కడప రీజియన్
ఉమ్మడి కడప జిల్లాలో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై మంత్రి ఆరా తీశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా నియామకాలు జరగకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కడప రీజియన్‌కు చెందిన కండక్టర్లు ఇతర జిల్లాల్లో పని చేస్తున్నారని, స్థానిక ఖాళీలపై కలెక్టర్ కార్యాలయంతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
సీనియారిటీ జాబితాలు & కోర్టు కేసులు
సీనియారిటీ జాబితాల పునఃపరిశీలన ప్రక్రియను మంత్రి సమీక్షించారు. 2016 కంటే ముందు రికార్డులు తెలంగాణ వద్ద ఉండటంతో, వాటిని సేకరించడానికి సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అలాగే రవాణా శాఖపై ఉన్న 88 కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో న్యాయ శాఖతో కలిసి అప్రమత్తంగా వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.
