
ఏపీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయి గుర్తింపు: ‘గవర్నెన్స్ నౌ’ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు కైవసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నందుకు గాను, ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రతిష్టాత్మక ‘గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్’ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని, వారి కృషికే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి కొనియాడారు.
ప్రధాన బస్టాప్‌లలో అమలు చేస్తున్న ‘ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్’ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బస్సుల రాకపోకలపై ముందస్తు సమాచారం అందించడం ద్వారా సేవల నాణ్యత పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా, సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆర్టీసీ ముందడుగు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు గారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
భవిష్యత్ ప్రణాళికలు:
ప్రజా రవాణా రంగంలో ఏపీఎస్‌ఆర్టీసీని దేశానికే ఆదర్శంగా నిలబెడతామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక, సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ వారి సాధికారతకు తోడ్పడటం. పండుగ సమయాల్లో అదనపు భారం పడకుండా సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడపడం వంటి నిర్ణయాలతో ప్రజలకు మరింత దగ్గరవుతామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
కాగా ఈ అవార్డును ‘ గవర్నెన్స్ నౌ’ అనే ప్రముఖ మీడియా సంస్థ అందజేస్తుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తించి ఈ గౌరవాన్ని అందిస్తుంది.
ఈ అవార్డు ప్రదానోత్సవం 2026, జనవరి 16వ తేదీ శుక్రవారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. '6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్ & అవార్డ్స్' కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రకటించారు.
ఏపీఎస్‌ఆర్టీసీ తరపున ఈ అవార్డును సంస్థ చీఫ్ ఇంజనీర్ వై. శ్రీనివాసరావు అందుకున్నారు. ‘గవర్నెన్స్ నౌ’ మేనేజింగ్ డైరెక్టర్ కైలాష్‌నాథ్ అధికారి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన బస్టాప్‌లలో ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది.
బస్సుల రాక, పోకల సమయాలు, ప్లాట్‌ఫారమ్ నంబర్లు, రూట్ వివరాలు వంటి సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్పష్టంగా, డిజిటల్ పద్ధతిలో అందించడంలో ఆర్టీసీ చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది.
