Let's talk: editor@tmv.in
ఏపి ని వదలని వాయుగుండాలు, మళ్లీ వర్షాలు..

ఏపి ని వదలని వాయుగుండాలు, మళ్లీ వర్షాలు..

Dantu Vijaya Lakshmi Prasanna
27 నవంబర్, 2025

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. బంగాళాఖాతంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా మళ్లీ వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు . మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని, ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది.

గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఒకటి కాదు రెండు వాయుగుండాలు

బంగాళాఖాతం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. వరుస అల్పపీడనాలు, వాయుగుండంతో పాటు తుపాను పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా తెలంగాణలో చలి పూర్తిగా తగ్గిపోయింది. ఈ వారం సెన్యారు తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఏపి ని వదలని వాయుగుండాలు, మళ్లీ వర్షాలు.. - Tholi Paluku