
ఏపిలో త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం - ఒకే కార్డుతో అన్ని సేవలు
అమరావతిలోని సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రియల్ టైమ్ గవర్నెన్సు డేటా లేక్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న వివరాలను సమన్వయం చేస్తూ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తుందని ఈ సమావేశంలో తెలిపారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే జూన్ నాటికి ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా కుటుంబం, వ్యక్తుల వివరాల సేకరించనున్నట్లు చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణకు ఒకటే కార్డ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌరసేవలను, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని అధికారులకు సూచించారు.
ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను విస్తృతం చేయాలి
రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీటిని రూపొందించాలని ఇతర ప్రభుత్వ శాఖలను వినియోగించుకోవాలని సూచించారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు , స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు.
ఒకే కార్డు ద్వారా పౌరసేవలు
సుపరిపాలనలో భాగంగా ఒకే కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించటంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు సీఎస్ కె. విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్య, గ్రామవార్డు సచివాలయ, పురపాలక, ప్లానింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
