Let's talk: editor@tmv.in
ఏపిలో జిల్లా కలెక్టర్ల సదస్సు 4.5

ఏపిలో జిల్లా కలెక్టర్ల సదస్సు 4.5

Dantu Vijaya Lakshmi Prasanna
18 డిసెంబర్, 2025

అమరావతిలోని సచివాలయంలో డిసెంబర్ 1 7,18 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన 5వ జిల్లా కలక్టర్ల సమావేశం రెండవరోజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. ఈ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తూ జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలన్నారు.

ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి

అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలి. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలి. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ సదస్సులో చర్చిస్తున్నాం, నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యం అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధాం. వ్యవస్థలో ఉండే లోపాలను గుర్తించి వాటిని వినియోగించి పని నుంచి తప్పించుకునే పరిస్థితులు వచ్చాయి. రెవన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఫైళ్లను పరిష్కరించుకుండా తమ వద్ద నుంచి వేరే వారికి పంపించేస్తున్నారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి.. డేటా డ్రివెన్ గవర్నెన్సు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు

చంద్రబాబు అధికారులతో మతలాడుతూ, మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం.. కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించింది. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు.

లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారు. ప్రతీ శాఖ ఆన్ లైన్ ద్వారా ఫైళ్లు నడపాలి సేవలు అందించాలి. గత పాలకుల నిర్వాకం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటిని తిరిగి ప్రవేశపెట్టామన్నారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాం

జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15 శాతం వృద్ధి రేటు సాధన కష్టం కాదు. నీటి భద్రత, ఉద్యోగాల కల్పన, అగ్రిటెక్ లాంటి అంశాల ద్వారా ఈ వృద్ధిని సాధిద్ధాం. మన ప్రభుత్వానికి వారసత్వంగా 70 శాతం మేర ధ్వంసమైన రోడ్లు వచ్చాయి. నీటి సమస్యలు, మద్ధతు ధరలు లేకపోవటం, భూ వివాదాలు, విద్యుత్ బిల్లులు ఎక్కువ రావటం లాంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పుడు మనం నీటి భద్రత తెచ్చాం, రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చూస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా... తగ్గించాం. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వసనీయత వచ్చింది. దీనిని కాపాడుకోవాలి. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్ లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకునేలా చర్యలు ఉండాలి.

కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు

కలెక్టర్ల పనితీరుగురించి మాట్లాడుతూ, కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లు, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్ర అన్నారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకం, కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. ప్రతీ నిమిషం నన్ను నేను బెటర్ గా తీర్చిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాను. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకోవాలి. స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ సిటీల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. ప్రీవెంటివ్, క్యురెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనేది చాలా ముఖ్యమనీ చంద్రబాబు అన్నారు.

మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్న పవన్ కళ్యాణ్

కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగిసస్తూ, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ అభినందనలు. 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశాం. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నాం. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నరేగా నుంచి చెల్లించాం. గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామన్నారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలి. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయగలిగాం. రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించాం. సకాలంలో పనులు పూర్తి చేయగలిగాము. 2025 - 2026 ఆర్ధిక సంవత్సరానికి 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ. 4,330 కోట్ల వేతనాల రూపంలో చెల్లించాం. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 1,056.85 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాం. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేయూతను ఇచ్చింది.

పార్వతీపురం, అల్లూరి జిల్లా కలెక్టర్లు భేష్

గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తాం. టాక్స్, నాన్ టాక్స్ అసైన్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఉద్యోగుల సామర్థ్యం పెంపుకి ఈ శిక్షణా తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పాలనా సామర్థ్యాల పెంపు కోసం కలెక్టర్లు కృషి చేయాలి. జూన్ నెలలో తీసుకువచ్చిన స్వచ్ఛ రథం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. జూన్ లో ఒక యూనిట్ తో ప్రారంభించగా నేటికి ఆ సంఖ్య 25కి చేరింది. పీఎం జన్మన్ పథకం, ఉపాదిహామీ పధకం సాయంతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టాం. రహదారుల నిర్మాణానికి అవసరం అయిన అటవీ అనుమతుల వ్యవహారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ 9కి 9 అనుమతులు పూర్తి చేసి 100 శాతం స్ట్రయిక్ సాధించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ 88కి 79 పనులకు అనుమతులు క్లియర్ చేశారు. అడవి తల్లి బాట పనులపై కలెక్టర్లు శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం. మరింత ఉత్సాహంగా పని చేస్తూ నిబద్దతతో ప్రజలకు సేవలు అందించాలి” అన్నారు.

జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ,

చంద్రబాబు నేతృత్వంలో మన రాష్ట్రం ప్రాధాన్యతలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రతీ ప్రభుత్వ పాలసీ, నిర్ణయం ప్రజలను ప్రభావితం చేస్తుంది. అందుకే అత్యంత భాధ్యతా యుతమైన పాలన అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. ప్రతీ జిల్లా జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకుని ప్రగతి సాధించాలని ఆకాంక్షింస్తున్న అన్నారు.

ప్రభుత్వం అంటే కలెక్టర్లే - అనగాని సత్యప్రసాద్

గత నాలుగు కలెక్టర్ల సదస్సుల్లో జీఎస్డీపీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఒకటే జెండా, అజెండా ప్రతీ ఇంటికీ సంపద, అభివృద్ధి చేరాలన్నదే లక్ష్యం. ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. సోమవారం ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని కలెక్టర్లు అందరినీ కోరుతున్నాను. పరిశ్రమలకు ఇస్తున్న భూములను, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలి. ఇటీవల రెవెన్యూ సంస్కరణల్ని కూడా చేపట్టాం. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలి. రీసర్వేను సమర్ధంగా నిర్వహించాలి. 2 లక్షలకు పైగా ఉన్న జాయింట్ ఎల్ పీఎంల వివాదాలను పరిష్కరించండి. 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని రంగాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.