ఏపిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మొదటి అడ్వయిజరీ సమావేశం
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మొదటి అడ్వయిజరీ సమావేశం గురువారం ఏపి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన అడుగని ఏ పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు, అడ్వయిజరీ కమిటీ చైర్మన్, కమిటీ కోచైర్మన్, నెరెడ్ క్యాప్ విసి అండ్ ఎండి, సెక్రటరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో ఏపిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు.
సమావేశం యొక్క ముఖ్యాంశాలు:
ఈ సమావేశంలో ముఖ్య౦గా ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి చేయనున్న ప్రాజెక్టులు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగింది. ఈ అడ్వయిజరీ కమిటీకి నీతి ఆయోగ్ సభ్యులు డా. వి.కె. సారస్వత్ చైర్మన్‌గా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయి సంస్థలకు మధ్య సమన్వయాన్ని సూచిస్తుంది. నెరెడ్ క్యాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మెంబర్స్ ఇతర ప్రముఖులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణులు మరియు ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
ఈ అడ్వయిజరీ కమిటీ సాంకేతికతను అవలంబించడం, పరిశోధన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన గ్రీన్ హైడ్రోజన్ వివరాలు:
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ :
ఏపి రాజధాని అమరావతిలో 2025 జూలైలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ తరువాత, ఏ పి ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్' ను విడుదల చేసింది. ఈ ప్రకటన సారాంశం రాష్ట్రానికి 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో దేశంలోనే అగ్రగామి స్థానం కల్పించేందుకు ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.
దీని ప్రధాన లక్ష్యాలు
: ఏ పి ప్రభుత్వం 2030 నాటికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించడం, 5 GW (గిగావాట్ల) ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తికి కీలకమైన యంత్రం తయారీ సామర్థ్యాన్ని స్థాపించడం, అలాగే ప్రస్తుతం ఉన్న ధరను గణనీయంగా తగ్గించి, గ్రీన్ హైడ్రోజన్ ధరను ₹160–170/kgకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది
ముఖ్య విధానాలు, ప్రోత్సాహకాలు :
గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ అమోనియా పాలసీ 2023 ప్రకారం ఈ విధానం ఉత్పత్తి యూనిట్లకు, సంబంధిత పరికరాల తయారీ ప్లాంట్లకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. 25 GW పునరుత్పాదక శక్తిని తరలించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ అభివృద్ధి చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆర్ ఇ ప్లాంట్ల కోసం ప్రభుత్వ భూమిని తక్కువ లీజు ధరకు కేటాయిస్తారు. ప్రతి 1 ఎమ్ టి పి ఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వలన సుమారు 12,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది
పరిశోధన, ఆవిష్కరణ
భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఏపి ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ₹500 కోట్లు కేటాయించింది. రాష్ట్రం ఇప్పటికే గ్రీన్‌కో, రీన్యూ పవర్ వంటి సంస్థలతో పాటు, అంతర్జాతీయంగా బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థల నుండి పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది, ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అడ్వయిజరీ కమిటీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూల దిశగా మార్చడం అనే లక్ష్యంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ' లక్ష్యంతో వేల కోట్ల పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లను ఏర్పాటు చేయడానికి బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
ఎన్ టి పి సి గ్రీన్ హైడ్రోజన్ హబ్, పూడిమడక (విశాఖపట్నం)
ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే కాక, దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఎన్ టి పి సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ అనకాపల్లి జిల్లాలోని పూడిమడక (విశాఖపట్నం సమీపంలో) మొదలయ్యింది. పెట్టుబడి అంచనా దాదాపు ₹1.85 లక్షల కోట్లు (₹85,000 కోట్ల ప్రాజెక్టుగా కూడా కొన్ని నివేదికల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం సుమారు 1,200 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో, 4,500 టన్నుల గ్రీన్ అమోనియా, గ్రీన్ మెథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి ఉత్పన్నాలను తయారుచేయడం.
ఇందులో ముఖ్య అంశం ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎలక్ట్రోలైజర్ తయారీ మరియు సంబంధిత అనుబంధ పరిశ్రమల కోసం 1,200 ఎకరాలలో ఒక సమగ్ర 'గ్రీన్ హైడ్రోజన్ హబ్'ను సృష్టించనుంది.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ప్లాంట్ (తిరుపతి)
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది. దీన్ని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టు తిరుపతి లో మొదలయ్యింది. దీని పెట్టుబడి వ్యయ౦ సుమారు ₹1,000 కోట్లు. దీని ఉత్పత్తి సామర్ధ్యం ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ గా ఉంది. దీనిలోని ముఖ్యమైన అంశం, ఈ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ఆరంభించిన తొలి యూనిట్.
కృష్ణపట్నం & కాకినాడలో భారీ అమోనియా ప్రాజెక్టులు (ప్రతిపాదనలు)
గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల వివరాలు
• ఏ ఎమ్ గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును కాకినాడ లో మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు వివరాలు చూస్తే, ప్రతి సంవత్సరం 1.0 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్-ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ ప్లాంట్ గా దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ పెట్టుబడి అంచనా ₹1.85 కోట్ల వరకు ఉండి మూలధన రాయితీ ని కూడా కలిగి ఉంది.
• యామ్నా యూకే అనే సంస్థ కృష్ణపట్నంలో దీన్నిచేపట్టింది. ఈ ప్రాజెక్టు వివరాలు చూస్తే ఇది 1ఎమ్ ఎమ్ టి పి ఏ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు. దీని పెట్టుబడి అంచనా₹16,000 కోట్లు గా ఉంది.
• జె కె ఎస్ ఎచ్ హైన్‌ఫ్రా సంస్థ మచిలీపట్నంలో దీన్ని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 150 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 600 కిలో టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయడం ప్రధాన లక్ష్యం గా పెట్టుకుంది. దీని పెట్టుబడి అంచనా ₹35,000 కోట్లు గా ఉంది.
• ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ కాకినాడలో ఏర్పాటయ్యింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కీలకమైన సాంకేతికతను స్థానికీకరించే ప్రయత్నంలో భాగంగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. జాన్ కాకరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ సంస్థ కాకినాడ లో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ను 2 GW ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్ధ్యం గల తయారీ యూనిట్ గా రూపొందించారు.
ఈ ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రయోజనాలను (సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, పునరుత్పాదక ఇంధన వనరులు) ఉపయోగించుకొని, దేశంలో గ్రీన్ హైడ్రోజన్ దాని ఉత్పన్నాల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక కేంద్రంగా మారుస్తున్నాయి.
