Let's talk: editor@tmv.in
ఏపీఎస్ఆర్టీసీలో 281 అప్రెంటిస్ ఖాళీలు

ఏపీఎస్ఆర్టీసీలో 281 అప్రెంటిస్ ఖాళీలు

Shaik Mohammad Shaffee
19 సెప్టెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్షిప్ చేయడానికి 281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 4లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా చిత్తూరు జిల్లా పరిధిలో 48, తిరుపతి జిల్లా పరిధిలో 88, నెల్లూరు జిల్లా పరిధిలో 91, ప్రకాశం జిల్లా పరిధిలో 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ (సివిల్) ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100+జీఎస్టీ రూ.18 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అక్టోబర్ 6లోగా తమ సర్టిఫికెట్ నకళ్లను, రెజ్యూమ్ను ప్రిన్సిపల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజి, కాకుటూర్, వెంకచలం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, పిన్ కోడ్: 524320 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆధార్ కార్డులో ఉన్న వివరాలు సర్టిఫికెట్లలో ఉన్న వివరాలతో సరిపోలాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు APSRTC అధికారిక వెబ్సైట్ www.apsrtc.ap.gov.inలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ను చదవండి.

ఏపీఎస్ఆర్టీసీలో 281 అప్రెంటిస్ ఖాళీలు - Tholi Paluku