
ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్
భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) దేశీయ ఆర్చరీ క్రీడలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్ అక్టోబర్ 2 నుండి 12 వరకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనుంది.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అనేది దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్. ఇది దేశంలోని, విదేశాలలోని అత్యుత్తమ పురుష, మహిళా రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లను ఒకే వేదికపైకి తీసుకురానుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, జాతీయ స్థాయిలో ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేయడం ఈ లీగ్ ప్రధాన లక్ష్యాలు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటాయి. వీటిలో 36 మంది అగ్రశ్రేణి భారతీయ ఆర్చర్లు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు భాగం కానున్నారు. రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు ఒకే జట్టులో, రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల కింద పోటీ పడటం ఈ లీగ్ ప్రత్యేకత.
ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఏకాగ్రత, ధృడ సంకల్పాన్ని నేర్పుతుంది. అందుకే ఈ లీగ్‌తో నా అనుబంధం ఏర్పడింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఇది భారత ఆర్చర్లకు గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరవడానికి పెద్ద వేదిక అవుతుంది. ఈ విప్లవాత్మక కార్యక్రమానికి నా మద్దతును అందిస్తూ, భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవడానికి సిద్ధంగా ఉన్నాను' అని అన్నారు.
భారత ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడు అర్జున్ ముండా మాట్లాడుతూ, 'భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి యువ ఆర్చర్ల కలలో మేము ఊహించిన ఒక కల ఇది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌తో ఆ కలలను నెరవేర్చగలమని, సరికొత్త అవకాశాలను సృష్టించగలమని, దేశంలో ఈ క్రీడను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలమని మేము నమ్ముతున్నాం. రామ్ చరణ్ వంటి గ్లోబల్ ఐకాన్ మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆయన ప్రభావం లక్షలాది మంది యువతలో ఆర్చరీ పట్ల ఆసక్తిని పెంచుతుంది' అని తెలిపారు.
ఏఏఐ సెక్రటరీ జనరల్ వీరేంద్ర సచ్‌దేవా కూడా ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. 'ఇతర క్రీడల్లో జరిగిన లీగ్‌ల ప్రేరణతో, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారత ఆర్చరీకి వృత్తిపరమైన ప్రమాణాలు, విస్తృతమైన గుర్తింపు, గ్లోబల్ పోటీతత్వాన్ని తీసుకువస్తుంది. ఇది కేవలం ఒక లీగ్ మాత్రమే కాదు, భారతదేశం ఒలింపిక్ కల వైపు ఒక అడుగు' అని ఆయన అన్నారు.
