Let's talk: editor@tmv.in
ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్:అస్సాంలో 8 ఏనుగులు మృతి

ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్:అస్సాంలో 8 ఏనుగులు మృతి

Pinjari Chand
21 డిసెంబర్, 2025

అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున అస్సాంలోని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే పరిధిలోని లుమ్డింగ్ డివిజన్‌లో ఉన్న జమునాముఖ్ – కంపూర్ సెక్షన్‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. సైరాంగ్–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 20507 డీఎన్) ఏనుగుల గుంపును ఢీకొనడంతో లోకోమోటివ్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్రమాదంలో 8 ఏనుగులు మృతి చెందాయి. అయితే ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు, రైలు పునరుద్ధరణ

సమాచారం అందిన వెంటనే ఎన్.ఎఫ్. రైల్వే జనరల్ మేనేజర్, లుమ్డింగ్ డివిజనల్ రైల్వే మేనేజర్, అలాగే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌లు స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టాయి.

ప్రమాదానికి గురైన బోగీల్లోని ప్రయాణికులను ఇతర బోగీల్లో ఖాళీగా ఉన్న బెర్త్‌లలో తాత్కాలికంగా అక్కడే ఉంచారు. దెబ్బతిన్న బోగీలను విడదీసిన అనంతరం, ప్రభావిత రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉదయం 6:11 గంటలకు గువాహటి వైపు బయలుదేరింది. గువాహటికి చేరుకున్న తర్వాత అదనపు బోగీలను జతచేసి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్.ఎఫ్. రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిశోర్ శర్మ ఏఎన్ఐకి వెల్లడించారు.

ఏనుగుల కారిడార్ కాదని రైల్వే వివరణ

ప్రమాదం జరిగిన ప్రాంతం గువాహటి నుంచి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఉందని, అది అధికారిక ఏనుగుల కారిడార్ కాదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఏనుగుల గుంపు కనిపించగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ, ఏనుగులే రైలును ఢీకొట్టాయని తెలిపారు. పునరుద్ధరణ పనులు పూర్తైనప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ సెక్షన్‌లో వెళ్లాల్సిన రైళ్లను యూపీ లైన్‌కు మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

ఏనుగుల రక్షణకు ఏఐ సాంకేతికత

ఇదిలా ఉండగా, భారతీయ రైల్వేలో సాంకేతిక అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వ్యవస్థలను సంకేత వ్యవస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.ఏఐ ఆధారిత ఇన్‌ట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) ను డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (డీఏఎస్) ద్వారా ఏనుగుల కదలికలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ఇప్పటికే ఎన్.ఎఫ్. రైల్వేలో 141 రూట్ కిలోమీటర్ల పరిధిలో అమల్లో ఉంది. అదనంగా, 981 రూట్ కిలోమీటర్లకు సంబంధించి టెండర్లు కూడా మంజూరయ్యాయి. ఈ వ్యవస్థతో రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఏనుగుల కదలికలు గుర్తించి, లోకో పైలట్‌లు, స్టేషన్ మాస్టర్లు, కంట్రోల్ రూమ్‌లకు ముందస్తు హెచ్చరికలు పంపి ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటారు.