Let's talk: editor@tmv.in
ఏదైనా వ్యతిరేక విషయాన్ని కేంద్రం ‘జిహాద్’గా నిర్ణయించింది: జమియత్ అధ్యక్షుడు మదనీ

ఏదైనా వ్యతిరేక విషయాన్ని కేంద్రం ‘జిహాద్’గా నిర్ణయించింది: జమియత్ అధ్యక్షుడు మదనీ

Pinjari Chand
3 డిసెంబర్, 2025

జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా మెహమూద్ మదనీ ‘జిహాద్’అనే పదం గురించి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన ఒక రోజు తర్వాత, జమియత్ అధ్యక్షుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను స్పష్టం చేశారు. ‘జిహాద్’ అనే పదానికి వ్యతిరేక అర్థాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలే జోడించాయని, అసలు దాని చరిత్ర ‘పవిత్రమైనది’ అని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడటమే నిజమైన జిహాద్ అని ఆయన పేర్కొన్నారు.

నిజమైన జిహాద్ అర్థం కోసం మేం పోరాడుతున్నాం

జిహాద్ అనే పదాన్ని ప్రణాళికాబద్ధంగా దుర్వినియోగం చేస్తున్నారని, దేశంలో ముస్లింలను అవమానించేందుకు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, థూక్ జిహాద్, ఓట్ జిహాద్ వంటి పదాలను కనిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం మంత్రిత్వ శాఖ, కేంద్రమైనా రాష్ట్రమైనా, ముస్లింలకు సంబంధించి ఏదైనా వ్యతిరేక విషయం వెలుగులోకి వస్తే దాన్ని 'జిహాద్' అని పిలవాలని నిర్ణయించుకుంది. జిహాద్ అనేది పవిత్రమైన పదం. నిజమైన జిహాద్ అర్థం కోసం మేము పోరాడుతున్నాం. ఇస్లాంను అవమానించేందుకు 'జిహాద్' పదాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా వాడుతున్నారని జమియత్ అధ్యక్షుడు అన్నారు. తన మునుపటి వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడిందా అని అడిగినప్పుడు, తన మాటలకు బాధ్యత తీసుకుంటూ, చెప్పిన సందర్భంలో చూస్తే తప్పుగా అర్థం చేసుకోరని అయినా తన మాటలు తప్పుగా అర్థం కాకుండా చూసుకోవడం తన బాధ్యత అని, అందులో విఫలమైనందుకు తనను నిందించవచ్చని మదనీ అన్నారు.

ఉగ్రవాదులను ‘ఫసాదీ’ అని పిలవండి

పూర్తి ప్రసంగం వింటే మూడు విషయాలు స్పష్టమవుతాయి. ఒకటి, భారతదేశంలో జిహాద్‌కు బహుళ అర్థాలున్నాయి. అతి పెద్ద జిహాద్ అంటే నీ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి, స్వయంగా కష్టపడటం. అన్యాయం జరిగితే దానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తడం కూడా జిహాద్ అని ఆయన వివరించారు. ఉగ్రవాదంతో జిహాద్‌ను ముడిపెట్టడం తప్పు అని, ఉగ్రవాదులకు సరైన పదం 'ఫసాదీ' (అల్లరి మూకలు) అని, జిహాద్ అంటే దానికి పూర్తి వ్యతిరేకమని మౌలానా అన్నారు. నేను ఈ సంస్థలో సెక్రటరీగా చేరినప్పటి నుంచి ఉగ్రవాదులు ఇస్లామిక్ పదాలను ఎలా తప్పుదోవ పట్టించి 'ఫసాద్' (అల్లరి) వ్యాప్తి చేస్తున్నారో బయటపెట్టడం నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను.

మేం ఉగ్రవాదులతో పోరాడటాన్ని జిహాద్ గా భావిస్తాం

మేం ఉగ్రవాదులతో పోరాడటాన్ని జిహాద్‌గా భావిస్తాం. నేను ఎప్పుడూ చెప్పినట్టు, వాళ్లు ఫసాదీలు, మేం 'జిహాదీ'లం" అని మౌలానా పేర్కొన్నారు. అందరు ముస్లింలు జిహాదీలు కాబట్టి ఫసాదీలే అని డిఫాల్ట్‌గా అనుకుంటారు(మతం ఆధారంగా మొత్తం సమాజంపై నేరపూరిత ముద్ర వేస్తున్నారు). నిజమైన జిహాద్ ఏమిటో వివరించడం నా బాధ్యత అయిందని ఆయన అన్నారు.

ఇటీవల చేసిన వ్యాఖ్యలు

ఇంతకుముందు భోపాల్‌లో జరిగిన జమియత్ నేషనల్ గవర్నింగ్ బాడీ సమావేశంలో మాట్లాడిన మదనీ, బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ కేసులను ఉదాహరిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలను కాపాడితేనే సుప్రీంకోర్టును సుప్రీంగా పరిగణించాలని ఆయన అన్నారు. అలాగే ఇస్లాం, ముస్లింల శత్రువులు 'జిహాద్'ను అవమానం, సంఘర్షణ, హింసకు పర్యాయపదంగా చేశారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహా ద్, తాలీమ్ జిహాద్, థూక్ జిహాద్ వంటి పదాలతో ముస్లింల విశ్వాసాన్ని అవమానిస్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలోని, మీడియాలోని బాధ్యతాయుత వ్యక్తులు ఇలాంటి పదాలు వాడడంలో సిగ్గుపడటం లేదు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో సహా అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.