
ఏడాదిలో వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ పరీక్షలు: రైల్వే బోర్డు సీఈఓ
వందే భారత్ స్లీపర్ రైలు నమూనా (ప్రోటోటైప్)ను ఏడాదిలోపు పరీక్షల కోసం సిద్ధం చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీశ్‌కుమార్ తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ రైల్ వికాస్ నిగం లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్) వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్వీఎన్ఎల్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ తయారు చేస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు సంస్థకు కీలక ప్రాజెక్టులలో ఒకటని చెప్పారు. ప్రోటోటైప్ పరీక్షలు పూర్తయ్యాక మొత్తం 120 రైళ్లను సరఫరా చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సంస్థ పూర్తి చేసిన ముఖ్యమైన ప్రాజెక్టులలో దేశంలోని తొలి వర్టికల్-లిఫ్ట్ సముద్ర వంతెన అయిన పంబన్ బ్రిడ్జ్ కూడా ఒకటని ఆయన తెలిపారు.
జూన్ 2026లో ఆవిష్కరణ?
అయితే ప్రోటోటైప్ విడుదలకు ఖచ్చితమైన నెలను సతీష్ కుమార్ వెల్లడించలేదు. ఇటీవల ఆర్వీఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సలీం అహ్మద్ మాట్లాడుతూ 2026 జూన్‌లో నమూనాను ఆవిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. అయితే అధికారులు మాత్రం పనులు కొనసాగుతున్నప్పటికీ పరీక్షలు వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముందని అంటున్నారు.
ఇప్పటికే ప్రారంభమైన వందే భారత్ స్లీపర్
ఈ ఏడాది జనవరి 17న ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైళ్ల జంటను కామాఖ్య –హౌరా మార్గంలో ప్రారంభించారు. ఇతర వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై పలు ఊహాగానాలు ఉన్నప్పటికీ రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
దశలవారీగా తయారీ
లోక్‌సభలో ఫిబ్రవరి 4న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ , వందే భారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ ప్రోటోటైప్ అభివృద్ధి, పరీక్షలు, తదుపరి సిరీస్ ఉత్పత్తి వంటి దశల్లో కొనసాగుతోందని తెలిపారు. మొత్తంగా 260 వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను తయారు చేయాలని ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
తయారీ బాధ్యతలు
120 రైలు సెట్లు – కినెట్ రైల్వే సొల్యూషన్స్ (ఆర్‌వీఎన్‌ఎల్–టీఎంహెచ్ జాయింట్ వెంచర్)
80 రైలు సెట్లు – బీహెచ్‌ఈఎల్– టిటాగర్ రైల్ సిస్టమ్స్ కన్సార్టియం
50 రైలు సెట్లు – ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ , చెన్నై మిగతావి – బీఈఎంఎల్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి. ఇటీవల కినెట్ రైల్వే సొల్యూషన్స్ మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న మరాఠ్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ కంపార్ట్‌మెంట్ డిజైన్ మాక్‌అప్‌ను కూడా ప్రదర్శించింది.
