
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఏడాదిన్నర తర్వాత మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వైయస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మారిందని ధ్వజమెత్తారు. గతంలో నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమావేశాలను తిరిగి ప్రారంభిస్తున్నామని, ఈసారి ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమవుతానని ప్రకటించారు.
మరోసారి పాదయాత్ర
ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడేళ్లు మాత్రమేనని, అందులో ఏడాదిన్నర తర్వాత మరోసారి పాదయాత్ర ప్రారంభిస్తానని వైయస్ జగన్ వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల చివర్లో లేదా మార్చి మొదట్లో మూడో బడ్జెట్ ప్రవేశపెడుతుందని, అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు.
ప్రతి ఇంట్లో అదే చర్చ
ప్రస్తుతం పాలన అన్యాయంగా మారిందని, రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా ఏమైనా చేయవచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని, పోలీసు వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, ప్రతి ఇంట్లో ‘జగన్ ఉన్నప్పుడు బాగుండేది’ అనే చర్చ జరుగుతోందని తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో మాట నిలబెట్టుకున్నామని, చెప్పింది చేసి చూపామని, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏ పథకం ఆపలేదని గుర్తుచేశారు.
మోసం, దగా – అదే చంద్రబాబు పాలన
ఎన్నికల తర్వాత చంద్రబాబు పాలనను మళ్లీ చూసిన ప్రజలు వాస్తవాలు గ్రహించారని అన్నారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అన్నీ మోసాలేనని, ఏ ఒక్కటీ అమలు కావడం లేదని విమర్శించారు. గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి పూర్తిగా దిగజారిందని, నాడు–నేడు మనబడి లేకపోవడం, 8వ తరగతి ట్యాబ్‌లు, టోఫెల్ క్లాస్‌లు నిలిచిపోవడం, గోరుముద్ద నాణ్యత తగ్గిపోవడం వల్ల పిల్లల ప్రాణాలే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు 43 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందని తెలిపారు.
అన్ని వ్యవస్థలు నిర్వీర్యం – బకాయిలే బకాయిలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎనిమిది క్వార్టర్లు పెండింగ్‌లో ఉందని, రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.700 కోట్లు మాత్రమే చెల్లించారని, రూ.4,900 కోట్లు బకాయి ఉన్నాయని తెలిపారు. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వక రూ.2,200 కోట్లు బకాయి పడ్డాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేశారని, 108, 104 సేవలను నిర్వీర్యం చేశారని, కోవిడ్ సమయంలో కొత్త వాహనాలు తీసుకొస్తే, ఇప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్
తమ ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తైన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడమే కాకుండా, రెండేళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారట. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. ఇంకా నిర్వహణ ఖర్చు ప్రభుత్వానిది. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి. ఇలాంటి స్కామ్‌కు పాల్పడిన వారిని, మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
నాలుగు కీలక రంగాల నాశనం
వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలతో పాటు శాంతి భద్రతల వ్యవస్థ కూడా పూర్తిగా నాశనమైందని అన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ లేవని, రైతు భరోసాలో రూ.40 వేలు ఇస్తామని చెప్పి రూ.10 వేలకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని, పోలీసింగ్ వ్యవస్థ కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలతో వైయస్సార్‌సీపీ మమేకం
ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నా, వైయస్సార్‌సీపీ ప్రజలకు అండగా నిలబడుతోందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత, రైతులు, అక్కచెల్లెమ్మలు ఎవరికైనా కష్టం వస్తే వారి తరపున జెండా పట్టుకుని పోరాడుతున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఏలూరు నియోజకవర్గంలో పార్టీ నాయకుడు జయప్రకాష్‌కు అందరూ సహకరించాలని కార్యకర్తలను కోరారు.ఈ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు జయప్రకాష్, కారుమూరి సునీల్‌తో పాటు సుమారు 200 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
