Let's talk: editor@tmv.in
ఏటీపీ డబుల్స్ టాప్–20లోకి యూకీ భాంబ్రి

ఏటీపీ డబుల్స్ టాప్–20లోకి యూకీ భాంబ్రి

Pinjari Chand
4 ఫిబ్రవరి, 2026

భారత టెన్నిస్ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. రౌండ్‌గ్లాస్ టెన్నిస్ అకాడమీకి చెందిన యూకీ భాంబ్రి తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్–20 స్థానానికి చేరాడు. దీంతో పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న తర్వాత టాప్–20లోకి ప్రవేశించిన తొలి భారత ఆటగాడిగా యూకీ నిలిచాడు. మునుపటి ర్యాంక్ 22 నుంచి రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న 33 ఏళ్ల యూకీ, తన కెరీర్‌లో తొలిసారిగా ఏటీపీ డబుల్స్ టాప్–20లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతనే భారత్ నంబర్–1 డబుల్స్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల యూకీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పలు ఏటీపీ టూర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో పాటు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ నిలకడైన ప్రదర్శన చేశాడు. స్వీడన్ ఆటగాడు ఆండ్రే గోరాన్సన్తో జతకట్టి మెల్బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరడం ఈ ర్యాంకింగ్ ఎదుగుదలకు కీలకంగా మారింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో యూకీ–గోరాన్సన్ జోడీ స్థానిక వైల్డ్‌కార్డ్స్ జేమ్స్ డక్‌వర్త్, క్రూజ్ హ్యుయిట్లను ఓడించింది. రెండో రౌండ్‌లో సాంటియాగో గోన్జాలెజ్–డేవిడ్ పెల్ జోడీపై 4-6, 7-6(5), 6-3తో ఉత్కంఠభరిత విజయం సాధించింది. మూడో రౌండ్‌లో బ్రెజిల్ జోడీ ఆర్లాండో లూజ్–రాఫెల్ మాటోస్ చేత 6-7(7), 3-6తో పరాజయం పాలైంది.

యూకీ భాంబ్రి ఎదుగుదల 2025 సీజన్ నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ వేనస్తో కలిసి యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరాడు. అదే ఏడాది మార్చిలో, ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్సీ పోపిరిన్తో కలిసి దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో తన తొలి ఏటీపీ 500 టైటిల్ను గెలుచుకున్నాడు. ఆ ఫైనల్‌లో నాలుగు మ్యాచ్ పాయింట్లు కాపాడుతూ సంచలన విజయం సాధించాడు. ఇంతకుముందు యూకీ, రోహన్ బోపన్న 286 వారాల పాటు కొనసాగిన భారత్ నంబర్–1 డబుల్స్ ఆటగాడు అనే రికార్డుకు ముగింపు పలికాడు. ప్రస్తుతం యూకీ మధ్యప్రాచ్యంలో జరిగే ఏటీపీ 500 టోర్నీల్లో పాల్గొననుండగా, అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగే డేవిస్ కప్ పోరుకు భారత జట్టులో చేరనున్నాడు.