
ఏటీఎం సెంటర్లలో కొత్త మోసం.. జర జాగ్రత్త!
దేశ రాజధానిలో ఏటీఎంల వద్ద మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టుకున్నారు. ప్రజల డెబిట్ కార్డులను గ్లూ లేదా ఫేవిస్టిక్‌తో ఇరుక్కుపోయేలా చేసి, వారి ఖాతాల నుంచి డబ్బును దోచుకునే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని నెబ్ సారాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అరెస్టయిన వారు రౌషన్ కుమార్ (23) పింటూ కుమార్ (32) అని అధికారులు వెల్లడించారు.
ఫెవిస్టిక్ తో కార్డులు బంధించి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ముందుగా ఏటీఎం కార్డు స్లాట్‌లో గ్లూ లేదా ఫేవిస్టిక్ రాసి కస్టమర్లు కార్డు మిషన్ లోపల పెట్టగానే ఇరుక్కుపోయేలా చేసేవారు. ఇక కార్డు బయటకు రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఏటీఎం వద్ద నకిలీ కస్టమర్ కేర్ నంబర్‌ను అతికించి ఆ నంబర్‌కు కాల్ చేయమని సూచించేవారు.అది నిజమని నమ్మిన ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు పింటూ కుమార్ బ్యాంక్ ఉద్యోగిలా నటిస్తూ మాట్లాడేవాడు. ఈలోపులో రౌషన్ కుమార్ కస్టమర్ పిన్ నంబర్‌ను గమనించి గుర్తుపెట్టుకునేవాడు. కస్టమర్ వెళ్లిపోయిన తర్వాత గ్లూతో ఇరుక్కున్న కార్డును బయటకు తీసి, దొంగిలించిన పిన్‌తో డబ్బును విత్‌డ్రా చేసేవారు.
రూ. 35,000 కోల్పోయిన బాధితుడు
ఇక ఈ మోసం కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది బాధితులను పోలీసులు గుర్తించారు. వీరిలో పశ్చిమ విహార్‌కు చెందిన అవతార్ సింగ్ అనే వ్యక్తి సెప్టెంబర్ 27న రూ. 35,000 కోల్పోయినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా నిందితుల వద్ద నుంచి మూడు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాక పింటూ కుమార్‌పై గతంలో అనేక కేసులు నమోదై ఉండగా, రౌషన్ కుమార్ మొదటిసారి ఈ రకమైన నేరంలో పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని, కార్డు ఇరుక్కుంటే బ్యాంక్ అధికారులను మాత్రమే సంప్రదించాలని పోలీసులు హెచ్చరించారు.
