Let's talk: editor@tmv.in
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి లోకేశ్‌

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి లోకేశ్‌

Pinjari Chand
18 ఆగస్టు, 2026

రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ) ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర సహాయాన్ని అందిస్తామని చెప్పారు. సోమవారం అమరావతిలో ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మెగా జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా ఈ ఏడాది డీఎస్సీ ద్వారా 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు లోకేశ్‌ తెలిపారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, డీఎస్సీ నియామకాల ద్వారా ఇప్పటివరకు సుమారు 10,060 ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షలు పూర్తయ్యాయని, ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిలిచిపోలేదని చెప్పారు. ఎంపికైన ఉపాధ్యాయులందరూ ఉగాది నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన శిక్షణ అందించి పాఠశాలల్లో వారి నియామక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

క్రీడాకారులకు ఉద్యోగాలు, భూములు

ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన భారత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే దిశగా రాష్ట్రాలు క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ అన్నారు. క్రీడల్లో రాణించే యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు, భూములు అందిస్తున్నామని తెలిపారు. ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఆమెకు ‘ఐఏఎస్‌ హోదా’కు అర్హత వస్తుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీని కూడా ఒలింపిక్స్‌కు వెళ్లిందని, ఆమెను భారతదేశానికి మంచి అవకాశంగా అభివర్ణించారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశాన్ని కేబినెట్‌ దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఆమోదించారని తెలిపారు.

క్రీడాకారులను సాధారణ పరీక్షలకు గురిచేయడం స్పోర్ట్స్‌ కోటా ఉద్దేశం కాదని, ప్రతిభను ప్రోత్సహించేందుకే నియామకాలు చేపడుతున్నామని లోకేశ్‌ చెప్పారు. కేంద్రం సూచనల మేరకు గుర్తింపు పొందిన క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచినట్లు తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీపై ఉద్దేశ పూర్వకంగానే కోర్టుకు వైసీపీ

మెగా డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయించారని లోకేశ్‌ ఆరోపించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత 148 రోజుల్లో 141 కేసులు దాఖలయ్యాయని, నియామక ప్రక్రియను నిలిపివేయడమే వాటి ఉద్దేశమని విమర్శించారు. అయితే అన్ని నిబంధనలను పాటిస్తూ నోటిఫికేషన్‌ రూపొందించడంతో న్యాయపరమైన సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొగలిగిందన్నారు. మెగా డీఎస్సీ నియామకాలను పూర్తి చేసి, ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు అందించి, శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చి తనతో చర్చకు సిద్ధం కావాలని లోకేశ్‌ సవాల్‌ చేశారు. నియామక ప్రక్రియ పూర్తై ఏడాది గడిచిన తర్వాత ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశంపైనా జగన్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని లోకేశ్‌ తెలిపారు. రాజ్యాంగంలో రిజర్వేషన్‌ విధానాన్ని తీసుకొచ్చిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విధానాన్నే జగన్‌ ప్రశ్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిలువు, అడ్డ రిజర్వేషన్లను పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైసీపీకి, నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలిలో డీఎస్సీపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి నిరుద్యోగ యువతకు ఒక్క మెగా డీఎస్సీ కూడా ఇవ్వలేకపోయిన బొత్స సత్యనారాయణ ఈరోజు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నీతులు మాట్లాడటం సిగ్గుచేటు. ఐదేళ్లు యువత జీవితాలతో ఆడుకున్న మీరా ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేది? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుద్యోగ యువతకు సకాలంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడితే దానిని కూడా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి లోకేశ్‌ - Tholi Paluku