
ఏజెన్సీ అడవులు ఆదానీ, నవయుగ సంస్థలకు అమ్మొద్దు
విశాఖ మన్యంలో నవయుగ, అదానీ సంస్థలకు ఇచ్చిన హైడ్రో ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖపట్నం సీఐటియు ఆఫీసులో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం మన్యం పార్వతీపురం జిల్లాలోని 20 పంచాయతీలో 250 గ్రామంలో 50 వేల మంది ఆదివాసులను జలసమాధి చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో రద్దు చేస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ అడవులు అదానీ, నవయుగ బడా ప్రైవేటు సంస్థలకు అమ్మొద్దని, ఆదివాసులకు జల సమాధి చెయ్యవద్దని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో భూమి, అడవులు, సహజ వనరులు, ఆదివాసుల హక్కు కల్పించింది. 1/70 అటవి హక్కు, పీసా చట్టం ప్రకారం బడా సంస్థలకు 5వ షెడ్యూల్ ప్రాంత భూములు, అడవులు పొందడం నిషేధం. 1997లో సమత వర్సెస్ బిర్లా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో ప్రవేట్ సంస్థలకు అడవులు, భూములు పొందడం నిషేధం. గ్రామ సభల ఆమోదం లేకుండా ఎటువంటి ప్రాజెక్టులు మొదలుపెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసుల అడవులు, భూమి సహజ వనరులు ప్రవేటు కంపెనీలకు అప్పగించేందుకు అటవీ పర్యావరణ చట్ట సవరణ చేస్తూ ఏజెన్సీలో బడా కార్పొరేట్ సంస్థలకు 100 హెక్టార్ల వరకు అడవులు అప్పగించడానికి చట్టం తెచ్చిందని పేర్కొన్నారు . కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాడేరు ఏజెన్సీలో అపారమైన సహజ వనరులు ప్రవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం దారుణమని విమర్శించారు. ఆదివాసులు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టులను అదానీ, నవయుగ కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం ముమ్మరం చేసిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాడేరు ఏజెన్సీలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందాలు చేస్తే తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అదే ఒప్పందాలు కొనసాగిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ సామర్ధ్యం పెంచుతూ జివో 51 ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉంటూ ఏజెన్సీలో పర్యటిస్తూ ఆదివాసులకు చేతికి చెప్పులు అందించి ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 20 వేల ఎకరాలు అడవులు, పట్టభూములు అదానీ నవయుగ కంపెనీలకు అప్పగించారని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో పాడేరు ఏజెన్సీలో ఆదివాసీల ఆమోదం లేకుండా డ్రోన్ సర్వేలు, సర్వే రాళ్ళు పాతే కార్యక్రమం ముమ్మరం చేస్తుందని, ఆదివాసుల అడవులు, భూములు అదానీ నవయుగ కంపెనీలకు ఇవ్వొద్దని, జలసమాధి చెయ్యొద్దని, వేల మంది ఆదివాసులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళుతుందని ధ్వజమెత్తారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, అనంతగిరి, అరకువేలి, చింతపల్లి, జీకే వీధి మండల పరిధిలో, అనకాపల్లి, విజయనగరం, మన్యం పార్వతీపురం జిల్లా దేవరపల్లి, వేపాడ, పాచిపెంట మండల పరిధిలో సుమారు 20 పంచాయతీ పరిధిలోని 20 వేల ఎకరాల అటవీ పట్టా భూముల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు ఇస్తూ 20 పంచాయతీ 250 గ్రామాలకు చెందిన 50 వేల మంది ఆదివాసులకు జల సమాధి చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణనికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదానీ, నవయుగ సంస్థలకు అనుమతి ఇచ్చింది.
జివో 51 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత చుట్టుప్రక్కల చిన్నచిన్న కాలువలు, గడ్డలు, గోస్తని, శారద, రాయ్ వాడ రిజర్వాయర్ నీటి వినియోగానికి పూర్తి అధికారం కల్పించిందని ఆరోపించారు. దీని వలన చుట్టుప్రక్కల ఆదివాసీ ప్రాంతాలు నీటి కొరత ఏర్పడి తీవ్రంగా నష్టపోతారని, అనకాపల్లి, చోడవరం, దేవరపల్లి, రాంభిల్లి, మునగపాక, అస్యుతాపురం, కోటపాడు మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు 7 మండల వ్యవసాయ భూములు బీడు భూములుగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మొత్తం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలో 20 పంచాయతీలు 250 ఆదివాసీ గ్రామంలో 50 వేల మంది జలసమాధి చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సత్యనారాయణ,కేవీపీఎస్, జిల్లా నాయకుడు అప్పారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు నర్సింగరావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.లక్ష్మణ్, విశాఖ జిల్లా కమిటి కార్యదర్శి రమణమూర్తి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడు కె.అప్పారావు పాల్గొన్నారు.
