
ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 7,267 ఉద్యోగాలు
తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్)లో భారీ స్థాయిలో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, టీజీటీ, పీజీటీ, ఇతర బోధన, బోధనేతర పోస్టులతో సహా మొత్తం 7,267 పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 23, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
ప్రిన్సిపాల్: 225 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 1,460 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 3,962 పోస్టులు, హాస్టల్ వార్డెన్: 635 పోస్టులు, ఫిమేల్ స్టాఫ్ నర్స్: 550 పోస్టులు, అకౌంటెంట్: 61 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్): 228 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్: 146 పోస్టులు. ఇందులో టీచింగ్ పోస్టులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పోస్టులే ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి విద్యార్హతలు, వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీతో పాటు బీ.ఎడ్ డిగ్రీ, 8 నుండి 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి గరిష్ఠంగా 50 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ, బీ.ఎడ్ ఉండాలి. వయోపరిమితి గరిష్ఠంగా 40 సంవత్సరాలు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీ.ఎడ్, సీటెట్ అర్హత ఉండాలి. వయోపరిమితి గరిష్ఠంగా 35 సంవత్సరాలు. హాస్టల్ వార్డెన్ పోస్టుకైతే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు. ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు 10వ లేదా 12వ తరగతి సైన్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇతర పోస్టుల వివరాలు, వయోపరిమితి సడలింపు, అర్హతల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదవవచ్చు..
దరఖాస్తుదారులు తమ కేటగిరీని బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,500, పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.2,000, నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.1,500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అన్ని పోస్టులకు రూ.500 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎలా ఎంపిక చేస్తారంటే?
ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో రాత పరీక్ష, అవసరాన్ని బట్టి స్కిల్/ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు, పాఠశాల క్యాంపస్‌లో ఉచిత వసతి, ఇతర ప్రత్యేక అలవెన్సులు కూడా లభిస్తాయి. ప్రిన్సిపల్‌కు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు, పీజీటీకి రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు, టీజీటీకి రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు, అకౌంటెంట్‌కు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, ల్యాబ్ అటెండెంట్‌కు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు, హాస్టల్ వార్డెన్‌కు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు, ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు నెలకు వేతనం లభించవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://emrs.tribal.gov.in/ను సందర్శించండి.
గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య పాఠశాలలు
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలలు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని 1997-98లో ప్రారంభించారు. ఈ పాఠశాలలు జవహర్ నవోదయ విద్యాలయాల తరహాలో సిబిఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు విద్యను అందిస్తాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం, ఇతర అవసరాలన్నీ ఉచితంగా అందిస్తారు. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి కోసం క్రీడలు, నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 7,267 పోస్టులకు నియామకాలు జరగడం వెనుక ప్రధాన కారణం, ఈ పాఠశాలల విస్తరణే. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు కొత్త పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, దేశవ్యాప్తంగా కొత్త ఏకలవ్య పాఠశాలల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ కొత్త పాఠశాలలను పూర్తిగా పనిచేసేలా చేయాలంటే, తగిన సంఖ్యలో బోధనా, బోధనేతర సిబ్బంది అవసరం. అందుకే 7,267 పోస్టుల భారీ నియామక ప్రకటన జారీ అయ్యింది.
కేంద్రం కొత్త పాఠశాలలను ముఖ్యంగా 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న బ్లాకులలో స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 728 కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనుంది. ఈ లక్ష్యాన్ని 2026 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. ఈ పాఠశాలల్లో అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీలు, హాస్టళ్లు, ఆట స్థలాలు, క్రీడా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, డిజిటల్ లెర్నింగ్, వృత్తి విద్యా శిక్షణ వంటి సదుపాయాలు ఉంటాయి.
