Let's talk: editor@tmv.in
ఏకతా దివస్ - ఉక్కు మనిషి స్ఫూర్తి, భారత ఐక్యతకు ప్రతీక

ఏకతా దివస్ - ఉక్కు మనిషి స్ఫూర్తి, భారత ఐక్యతకు ప్రతీక

Dantu Vijaya Lakshmi Prasanna
30 అక్టోబర్, 2025

చలికాలపు ఉదయపు వెలుగుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది…వీస్తున్న గాలి ప్రతి తాకిడిలోనూ ఒకే నినాదం మార్మోగుతుంది -“జై హింద్” అని, అది అక్టోబర్‌ 31, మన దేశానికి కేవలం ఒక తేదీ కాదు. ఇది భారత ఏకత్వం, సార్వభౌమత్వం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారిని స్మరించుకునే రోజు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రతి గుండె చప్పుడు ఈ రోజు ఒకే స్వరంగా మారుతుంది “ఏకతా దివస్!”

ఉక్కు మనిషి పుట్టిన రోజు

1875 అక్టోబర్ 31 గుజరాత్‌లోని నాడియాడ్ అనే చిన్న గ్రామంలో పుట్టిన శిశువు, తరువాత ఒక దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. అతని ఆలోచన, ధైర్యం, నిర్ణయం ఇవన్నీ ఉక్కు లాంటి దృఢమైనవి. అందుకే ప్రపంచం ఆయనను “ఉక్కు మనిషి” (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ) అని గౌరవించింది. స్వాతంత్రo తర్వాత భారతదేశం కేవలం ఒక జెండా కింద ఉన్న దేశం మాత్రమే కాదు. అది వందల సంస్థానాల సమ్మేళనం. ఆ సంస్థానాలను ఒకే భారతంగా కట్టిపడేసినది ఆయన రాజకీయ మేధస్సు, ఆయన దేశభక్తి.

సంస్థానాల విలీనం - ఒక చారిత్రాత్మక ఘట్టం

స్వాతంత్రo వచ్చినప్పుడు భారతదేశంలో 560కి పైగా సంస్థానాలు ఉన్నాయి. వీటిలో చాలామంది రాజులు, నవాబులు స్వతంత్రంగా ఉండాలనే దురాశపడ్డారు. అయితే పటేల్‌ గారు “ఒకే భారత్ – ఒకే జెండా” అనే ఆలోచనతో నిలిచారు. ఆయన చాకచక్యంతో, దౌత్యంతో, అవసరమైతే బలప్రయోగంతోనూ హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్‌ వంటి ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఐక్యతకు బలమైన పునాది అయ్యాయి.

దేశ నిర్మాణంలో దిశానిర్దేశకుడు

స్వాతంత్రo అనంతరం ఉపప్రధానమంత్రిగా, హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ పటేల్,

దేశంలో శాంతి, భద్రత, సమగ్రత కాపాడేందుకు అహర్నిశలు కృషి చేశారు. అల్లర్లను అణచి, ప్రజలలో విశ్వాసాన్ని నింపి, దేశానికి ఒక శాసనబద్ధమైన భవిష్యత్తును అందించారు. “దేశం అంటే భూమి కాదు, ప్రజల మధ్య ఉన్న ఐక్యతే నిజమైన భారతం” అన్నది ఆయన తాత్త్విక దృష్టి.

ఆయనకు శాశ్వత నివాళి

2018లో గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఆయనకు శాశ్వత నివాళి గా ఏర్పాటుచేయడం జరిగినది. స్టాట్యూ ఆఫ్ యూనిటి (ఏకతా విగ్రహం) ఆవిష్కరించబడింది. 182 మీటర్ల ఎత్తులో వెలసిన ఈ విగ్రహం కేవలం రాతి నిర్మాణం కాదు. ఇది ఒక దేశం స్ఫూర్తిగా నిలిచిన నాయకుడికి అర్పించిన శ్రద్ధాంజలి. ఈ విగ్రహం మనకు ప్రతి రోజూ ఒక జ్ఞాపకం అందిస్తుంది.

“భిన్నత్వంలో ఏకత్వం - అదే భారత ఆత్మ.”

ఏకతా దివస్ స్ఫూర్తి

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న దేశవ్యాప్తంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు, యువత, అధికారులు, సైనికులు అందరూ ఒకే తాత్త్విక సందేశాన్ని పంచుకుంటారు. “మనం వేరువేరుగా ఉన్నా, మన భారతం ఒకటే”. ఏకతా దివస్ అనేది కేవలం పండుగ కాదు. ఇది ప్రతి భారతీయుడి గుండెల్లో తలపెట్టుకోవలసిన విలువ. వల్లభాయ్ పటేల్ మనకు నేర్పింది, స్వాతంత్రo సంపాదించడం ఒక ఘట్టం దేశాన్ని ఏకం ఉంచడం ఒక ధర్మం.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇక లేరు, కానీ ఆయన చూపిన దారి, చూపిన దృష్టి, చూపిన ధైర్యం, ఈ భారతాన్నంత నడిపిస్తున్నకనిపించని ఒక అదృశ్య శక్తి. అందుకే మనం ఆయనను కేవలం జ్ఞాపకం చేసుకోము. ఆయన ఆలోచనలల్లో జీవిస్తాం.

ఏకతా దివస్ అంటే మన గుండెల్లో వెలిగే ఒక భారతమనే దీపం

“భిన్నత్వంలో ఏకత్వమే భారతానికి శక్తి . అదే సర్దార్ వల్లబాయ్ పటేల్ మనకు ఇచ్చిన శాశ్వత బోధ.”మరి అలాంటి ఉక్కు మనిషి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్, ఝవేర్‌భాయ్ లాడ్‌బా దంపతులకు 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాద్ పట్టణంలో జన్మించారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాకుండా, స్వాతంత్రానంతరం భారతదేశంలో ఉన్న సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాదు, జునాగఢ్ వంటి సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన ఘనత ఆయనదే. ఇంగ్లాండులో బారిస్టర్ పట్టా పొందిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి, మహాత్మా గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బార్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజల గౌరవాన్ని పొందారు. ఆయన కేవలం రాజకీయ నేతగానే కాకుండా, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన సామాజిక నాయకుడు కూడా.

బాల్యం మరియు విద్యాభ్యాసం

వల్లభభాయ్ పటేల్, ఆరుగురు సంతానంలో నాలుగవవాడు. ఆయన అన్న విఠల్‌భాయ్ పటేల్ కూడా స్వాతంత్ర సమరయోధుడే. చిన్నప్పటి నుంచే గొప్ప వ్యక్తిగా ఎదగాలన్న తపన వల్లభభాయ్‌లో ఉండేది. గుజరాతీ మాధ్యమంలో ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఆంగ్ల విద్యలో ప్రావీణ్యం సాధించాలని నిర్ణయించుకున్నారు. కరమ్‌సాడ్‌, పెట్‌లాద్‌, నాడియాద్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసి, మెట్రిక్యులేషన్‌ పరీక్షను విజయవంతంగా పూర్తిచేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే పన్నెండేళ్ల వయసున్న ఝవేర్‌బాను వివాహమాడారు. చదువు పూర్తయ్యేసరికి 22 ఏళ్ల వయసులో ప్లీడర్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

న్యాయవాది వృత్తి

1900 ప్రాంతంలో గోధ్రాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, క్రిమినల్ కేసుల్లో ప్రతిభ చూపి “సమర్థవంతుడైన డిఫెన్స్ లాయర్‌”గా పేరు సంపాదించారు. సాక్షుల నుండి నిజాలను వెలికితీయడంలో ఆయనకు అపూర్వ నైపుణ్యం ఉండేది. ఆయన వాదనలతో కేసులు తరచుగా నిందితుల పక్షాన తిరిగేవి. తర్వాత బోర్సాద్‌లో స్థిరపడి మంచి ప్రాక్టీస్‌ కొనసాగించారు. కుటుంబ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇంగ్లాండుకు వెళ్లి బారిస్టర్‌గా చదువు నెరవేర్చుకోవాలని అందువల్ల ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇంగ్లాండ్‌ విద్యాభ్యాసం

1910లో లండన్‌కు వెళ్లి మిడిల్ టెంపుల్‌లో చేరి బారిస్టరు కోర్సు అభ్యసించారు. సాధారణంగా మూడు సంవత్సరాలు పట్టే కోర్సును ఆయన కేవలం 30 నెలల్లో ఫస్ట్‌క్లాస్‌ హానర్స్‌తో పూర్తి చేసి, 1913లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్‌లో బారిస్టర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, క్రిమినల్ కేసుల్లోనే ఎక్కువగా పనిచేశారు. తన తెలివితేటలు, ముక్కుసూటితనం, ధైర్యం వల్ల ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందారు.

స్వాతంత్ర ఉద్యమంలో పటేల్

బారిస్టర్ పట్టా పొందిన తర్వాత గాంధీ ప్రభావంతో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.1928లో బార్దోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడంతో ప్రజలు ఆయనను ప్రేమతో “సర్దార్” అని పిలవడం ప్రారంభించారు. విదేశీ వస్త్రాల దహనం, ఖాదీ వస్త్రాల ప్రోత్సాహం, మద్యపాన నిషేధం, అస్పృశ్యత నిర్మూలన వంటి సామాజిక కార్యక్రమాల్లో ఆయన ముందుండి పనిచేశారు.

1931లో కరాచీ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం వంటి ప్రధాన ఉద్యమాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.

రాజ్యాంగ రచనలో పాత్ర

భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభభాయ్ పటేల్ విలువైన సూచనలు చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో కీలక పాత్ర పోషించారు. తానే ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్రపతికి ఆంగ్లో-ఇండియన్లను పార్లమెంటులో నామినేట్ చేసే అధికారం ఇవ్వాలని ప్రతిపాదించారు.

దేశ నిర్మాణంలో సర్దార్

స్వాతంత్రo అనంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో వల్లబాయ్ పటేల్ హోంమంత్రిగా, ఉపప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లను చాకచక్యంగా అణచివేశారు. ఆయన హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్‌ వంటి సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. నెహ్రూతో కొన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశ ప్రయోజనాన్ని ప్రథమంగా భావించి పనిచేశారు.

ఉక్కు మనిషి సంకల్పం - హైదరాబాద్ విలీనం (అపరేషన్ పోలో)లో సర్దార్ వల్లభభాయ్ పటేల్…

“ఏకం కాని దేశం స్వతంత్రం కాదు. విభజన అంటే బలహీనత” అన్నారు సర్దార్ వల్లభభాయ్ పటేల్. స్వాతంత్రo అనంతరం భారతం ముందు నిలిచిన విపరీత సవాలు సంస్థానాలు భారత్ లో కలవక పోవడం..

1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం సాధించింది. అయితే ఆ రోజు ఆనందంతో పాటు ఒక పెద్ద సమస్య కూడా ఎదురైంది. దేశంలో 560కి పైగా సంస్థానాలు తమ తమ రాజులతో, ప్రత్యేక సైన్యాలతో, స్వతంత్ర ఆకాంక్షలతో ఉన్నాయి. ఆ సంస్థానాలు భారత యూనియన్‌లో చేరాలా? లేక స్వతంత్రంగా ఉండాలా? అన్నది వారి నిర్ణయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి అగ్రనాయకులు ఇద్దరు ప్రధాన బాధ్యతలు తీసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ హోం మంత్రి గా నియమించబడ్డారు. దేశ ఐక్యత అనే మహత్తరమైన కర్తవ్యాన్ని పటేల్ గారు తన భుజస్కంధాలపై తీసుకున్నారు. వందల సంస్థానాలను చాకచక్యంగా భారత యూనియన్‌లో కలిపి “ఒక భారత్” నిర్మించడంలో ఆయన దృష్టి కేంద్రీకృతమైంది.

హైదరాబాద్‌ సంస్థానం - ఒక క్లిష్టమైన స్థితి

స్వాతంత్రo సమయానికి హైదరాబాద్ రాజ్యం దక్షిణ భారతంలో అతిపెద్ద సంస్థానం.

నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉన్న ఈ రాజ్యం విస్తీర్ణం 82,000 చదరపు మైళ్లు.

జనాభా సుమారు 1.6 కోట్లకు పైగా, ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉన్నా, పాలకుడు ముస్లిం నిజాం. నిజాం తన సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా, “స్వతంత్ర రాజ్యం”గా ఉండాలని ప్రకటించాడు. అతని సలహాదారు కసీం రజ్వీ, అతని మద్దతుదారులైన రజాకార్లు అనే సాయుధ బృందం హింసాత్మకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. రజాకార్లు హిందువులపై దాడులు చేసి, ప్రజల్లో భయాన్ని నింపారు. ఇది దేశ ఐక్యతకు ముప్పుగా మారింది.

సర్దార్ పటేల్‌ గారి నిర్ణయాత్మక వైఖరి

సర్దార్ పటేల్ హోం మంత్రిగా ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించారు.

ఆయన నమ్మకం “ఒక దేశంలో రెండవ దేశం ఉండకూడదు. భారత్ స్వాతంత్రo అంటే మొత్తం భూభాగం ఒక్కటిగా ఉండాలి.” నిజాంను రాజకీయంగా ఒప్పించే ప్రయత్నం మొదలైంది. కొందరి చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం, పటేల్ గారు చివరి దశ వరకు రక్తపాతం లేకుండా విలీనం జరగాలని కోరుకున్నారు. కానీ నిజాం నిరాకరించాడు, రజాకార్లు హింస పెంచారు. దాంతో పటేల్ గారు చివరి నిర్ణయం తీసుకున్నారు. అదే “ఆపరేషన్ పోలో ” ప్రారంభం.

ఆపరేషన్ పోలో *- *5 రోజుల సైనిక దాడి

1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం “ఆపరేషన్ పోలోపేరుతో సైనిక చర్య ప్రారంభించింది. దీనికి మేజర్ జనరల్ జె.ఎన్. చౌధరి ఆపరేషన్‌కి నాయకత్వం వహించారు. సుమారు 40,000 భారత సైనికులు పాల్గొన్నారు. కేవలం 5 రోజుల్లోనే, సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్‌ సైన్యం లొంగిపోయింది. ఈ ఆపరేషన్‌లో 800 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ దేశం మరొక విడిపోయిన భాగాన్ని తిరిగి తన గుండెల్లోకి చేర్చుకుంది. సర్దార్ పటేల్‌ గారి ఉక్కు సంకల్పం వల్లనే దక్షిణ భారతం కూడా భారత యూనియన్‌లో భాగమైంది.

హైదరాబాద్ లిబరేషన్ - దేశ చరిత్రలో మలుపు

సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్‌ విలీనం పూర్తి అయింది. ఆ రోజు దేశ చరిత్రలో ఒక ప్రధాన మలుపు. హైదరాబాద్‌ ప్రజలు స్వాతంత్ర సూర్యోదయాన్ని నిజంగా చూశారు. రజాకార్ల హింస ముగిసింది. భారత త్రివర్ణ పతాకం చార్మినార్ పై ఎగిరింది. పటేల్ గారు ఇలా ప్రకటించారు.

“ఇది కేవలం రాజకీయ విజయం కాదు,ఇది భారత ఐక్యతకు మరో పునాది.”

ఉక్కు మనిషి ధైర్యం - భవిష్యత్తుకి బోధ

హైదరాబాద్‌ విలీనం పటేల్ గారి దృఢనిశ్చయాన్ని నిరూపించింది. ఆయన దయతో, దౌత్యంతో, అవసరమైతే బలప్రయోగంతోనూ దేశాన్ని ఏకం చేశారు. దీనితో భారత్‌ కేవలం భౌగోళిక సరిహద్దుల సమ్మేళనం కాదు, ఇది ఒక ఐక్యతా భావనతో నిండిన దేశం అని ప్రపంచానికి చూపించింది. హైదరాబాద్‌ విలీనం చరిత్రలో ఒక అధ్యాయం కాదు.ఇది భారత ఏకత్వం యొక్క చిరస్థాయి ప్రతీక. సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు చూపిన ధైర్యం, నిర్ణయం, దేశభక్తి. ఈరోజు కూడా ప్రతి భారతీయుడికి ప్రేరణ. అందుకే ఆయనను ఉక్కు మనిషిగా పిలుస్తారు. ఆయన లేకపోతే భారత్‌ ఈరోజు ఒకటిగా ఉండేది కాదు.

“ఒక మనిషి తీసుకున్న ధైర్య నిర్ణయం… కోట్లాది ప్రజల భవిష్యత్తు మార్చింది.”

1950 డిసెంబర్ 15న సర్దార్ వల్లభభాయ్ పటేల్ ముంబైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. వేలాదిగా ప్రజలు, నాయకులు నివాళులు అర్పించారు.

1991లో భారత ప్రభుత్వం ఆయనకు “భారతరత్న” బిరుదును ప్రకటించింది.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ పేరు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరగని అక్షరాలుగా నిలుస్తుంది. దేశాన్ని ఏకం చేసిన ఆయన సంకల్పం, ధైర్యం, నిర్వాహణ నైపుణ్యం కారణంగానే ఆయనను ప్రపంచం “భారత ఉక్కు మనిషి” గా పిలుస్తుంది.

ఏకతా దివస్ - ఉక్కు మనిషి స్ఫూర్తి, భారత ఐక్యతకు ప్రతీక - Tholi Paluku