Let's talk: editor@tmv.in
ఏకగ్రీవంగా 68 మంది మహాయుతి అభ్యర్థుల ఎన్నిక

ఏకగ్రీవంగా 68 మంది మహాయుతి అభ్యర్థుల ఎన్నిక

Pinjari Chand
4 జనవరి, 2026

మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పాటు మహాయుతి కూటమికి చెందిన మొత్తం 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, అధికార కూటమి బెదిరింపులు, డబ్బు ప్రలోభాలతో ప్రత్యర్థి అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ–మహాయుతి కూటమికి చెందిన 68 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే విజయం సాధించారని బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యే శుక్రవారం తెలిపారు. ఇది పట్టణ స్థానిక సంస్థల్లో బీజేపీకి పెరుగుతున్న బలానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 68 మందిలో 44 మంది బీజేపీ అభ్యర్థులే. వీరిలో అత్యధిక సంఖ్య థానే జిల్లాలోని కల్యాణ్–డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉన్నాయి. ఆ తర్వాత పుణె, పింప్రి చించ్వడ్, పన్వెల్, భివండి, ధూలే, జల్గావ్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి ఏకగ్రీవంగా గెలిచారు.

పుణె నగరంలోని వార్డు నెంబర్ 35 నుంచి బీజేపీ అభ్యర్థులు మంజూషా నాగ్‌పురే, శ్రీకాంత్ జాగ్‌టాప్‌లు ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఇప్పటికే 2017–2022 మధ్య అదే వార్డుకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ విజయాలపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ మోహోల్ పుణె నగరానికి వచ్చే మేయర్ బీజేపీ నుంచే ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు. మాకు మొత్తం 125 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.ఇప్పటికే రెండు సీట్లు ఏకగ్రీవంగా గెలిచాం. ఇంకా 123 మిగిలి ఉన్నాయి. ఇది మా పార్టీ అందిస్తున్న అద్భుతమైన పాలనకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్ అని ఆయన అన్నారు. అలాగే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22 మంది అభ్యర్థులు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజాదరణ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్ అమలు చేసిన విజయవంతమైన ఎన్నికల వ్యూహమే కారణమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిళ్లతో పాటు ప్రధాన నగర పాలక సంస్థల్లో కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోందని వారు అన్నారు.

రాత్రి మూడు గంటల వరకు ఉపసంహరణలా?

అయితే, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధికార కూటమి డబ్బు, బెదిరింపులతో ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ నుంచి తప్పించిందని ఆరోపించాయి. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎక్స్ లో స్పందిస్తూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉన్నా, రిటర్నింగ్ అధికారులను రాత్రివరకు ఉపసంహరణలు స్వీకరించాలంటూ ఆదేశించారని ఆరోపించారు. ఈ విధానం సరైంది కాదని నా స్నేహితుడు చెప్పగా, స్థానిక ఎమ్మెల్యే మాట వినాలని గార్డియన్(ఇన్‌చార్జ్ మంత్రి) మంత్రి బెదిరింపు ధోరణిలో చెప్పాడు. ఇది ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న గూండారాజ్యం. ఒకరోజు బంగ్లాదేశ్, నేపాల్‌లా ప్రజా తిరుగుబాటు జరుగుతుందని రౌత్ వ్యాఖ్యానించారు.

ఎంఎన్‌ఎస్ నేత అవినాశ్ జాధవ్ మాట్లాడుతూ ఓటింగ్ లేకుండా గెలవాలనుకుంటే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అధికార పార్టీలు సీట్లను పరస్పరం పంచుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విమర్శించారు. శివసేన (యూబీటీ) నేత అర్వింద్ సావంత్ కూడా అధికార పార్టీల ఒత్తిడితోనే ఈ ఏకగ్రీవ విజయాలు సాధ్యమయ్యాయని ఆరోపించారు.

ఛత్రపతి శంభాజీనగర్లో శివసేన (యూబీటీ) నేత అంబాదాస్ దాన్వే, జిల్లా గార్డియన్ మంత్రి సంజయ్ షిర్సాట్ తమ పార్టీ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆరోపించారు.ముందుగా డబ్బు ఆఫర్ చేశారు. తిరస్కరించడంతో ఇల్లు కూల్చేస్తామని బెదిరించారని ఆయన తెలిపారు. మా అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్న అధికారులు గాడిదపై ఊరేగింపునకు సిద్ధంగా ఉండాలి. అన్ని కాల్స్‌కు సంబంధించిన వివరాలు నా వద్ద ఉన్నాయి. మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని దాన్వే సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

థానే మున్సిపల్ కార్పొరేషన్ (131 సభ్యులు)లో శివసేనకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ ప్రకటించింది. భివండి–నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆరుగురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ తెలిపింది. కల్యాణ్–డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్ల పరిశీలన అనంతరం ముగ్గురు శివసేన అభ్యర్థులు, ఒక బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న పుర ఎన్నికల్లో మొత్తం 2,869 కార్పొరేటర్ స్థానాలుండగా, వాటిలో ఇప్పటికే 68 స్థానాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిచారు.