Let's talk: editor@tmv.in
ఏఐ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోడీ కీలక భేటీ

ఏఐ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోడీ కీలక భేటీ

Shaik Mohammad Shaffee
21 ఫిబ్రవరి, 2026

దేశ సాంకేతిక ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ రంగాలకు చెందిన స్టార్టప్ సంస్థల సీఈఓలు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం 'సేవా తీర్థ్'లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం 16 అగ్రగామి స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, సైబర్ భద్రత, అంతరిక్షం, సామాజిక సాధికారత వంటి రంగాల్లో ప్రజల జీవితాలను మార్చేలా వారు చేస్తున్న కృషిని, ప్రదర్శించిన ఆవిష్కరణలను ప్రధాని అభినందించారు.

భారతీయ అవసరాలే ప్రాధాన్యత: ప్రధాని మోడీ

ప్రపంచస్థాయిలో ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోడీ కొనియాడారు. అయితే, ఆవిష్కరణలు కేవలం గ్లోబల్ మార్కెట్ కోసమే కాకుండా, భారతదేశపు ప్రత్యేక అవసరాలను తీర్చేలా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పంట ఉత్పాదకతను పెంచడం, నేల సారవంతాన్ని కాపాడేందుకు ఎరువుల వాడకాన్ని పర్యవేక్షించడం, పర్యావరణ పరిరక్షణలో ఏఐని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, మాతృభాషలో ఉన్నత విద్యను అందించడానికి ఏఐ సాధనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

డేటా గవర్నెన్స్, అపోహల పట్ల జాగ్రత్త

డిజిటల్ విప్లవంలో 'యూపీఐ' ఎలాగైతే సరళంగా, స్కేలబుల్‌గా మారిందో, ఏఐ రంగంలో కూడా అటువంటి వినూత్న పరిష్కారాలను తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డేటా గవర్నెన్స్ ప్రాముఖ్యతను ఆయన గుర్తుచేశారు. ఏఐ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపించకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలని, నైతికతతో కూడిన సాంకేతికతను అభివృద్ధి చేయాలని స్టార్టప్‌లను కోరారు. దేశీయ ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలని, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలని ఆయన సూచించారు.

గ్లోబల్ హబ్‌గా భారత్: స్టార్టప్‌ల హర్షం

భారతదేశంలో ఏఐ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు అద్భుతమని స్టార్టప్ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణల దిశ ఇప్పుడు భారత్ వైపు మళ్లుతోందని, దేశం ఏఐ రంగానికి గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్', ప్రపంచ యవనికపై భారత్ ముద్రను బలంగా ఆవిష్కరించిందని వారు కొనియాడారు.

ఈ సమావేశంలో బ్రిడ్జ్, అదాలత్ ఏఐ, బ్రెయిన్ సైట్ ఏఐ, క్రెడో ఏఐ, ఎకా కేర్, గ్లీన్ వంటి 16 ప్రముఖ సంస్థల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రధాన కార్యదర్శి పి.కె. మిశ్రా, ప్రధాన కార్యదర్శి-2శక్తికాంత దాస్, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద తదితరులు పాల్గొన్నారు.