
ఏఐ సురక్షిత వినియోగానికి ప్రత్యేక వ్యవస్థ: పీఎం నరేంద్ర మోడీ
కృత్రిమ మేధ సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, సున్నిత వర్గాలపై పెరుగుతున్న ముప్పుల నేపథ్యంలో భారత్ తన నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఏఐ ఆధారిత కంటెంట్‌కు వాటర్‌మార్క్ విధానం, డేటా రక్షణ బలోపేతం, అలాగే నైతిక, బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘ఇండియా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికత మానవ ఉద్దేశాలకు శక్తిని అందించే సాధనమే గానీ, తుది నిర్ణయాధికారం ఎల్లప్పుడూ మనుషులదేనని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం, పాలనపై చర్చలు జరుగుతున్నాయని, ఆ చర్చలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు.
ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన బాధ్యత కూడా పెరగాలి. ఆవిష్కరణకు అవకాశమిస్తూ, అదే సమయంలో దుర్వినియోగాన్ని నిరోధించే బలమైన భద్రతా వ్యవస్థ అవసరం. మానవ పర్యవేక్షణ, పారదర్శకత, భద్రతా రూపకల్పన వంటి మౌలిక సూత్రాలపై ఆధారపడిన ప్రపంచ స్థాయి ఒప్పందం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.డీప్‌ఫేక్‌లు, నేర కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని కఠినంగా నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విమానయానం, నౌకాశ్రయంలో ఉన్నట్లే ఏఐ రంగంలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు అవసరమని సూచించారు.
భారత్ ఇప్పటికే సమతుల్య దృక్పథాన్ని అవలంబిస్తుందని, ఆవిష్కరణకు ప్రోత్సాహమిస్తూ భద్రతా చర్యలను అమలు చేస్తున్నదని తెలిపారు. 2025 జనవరిలో ప్రారంభించిన ఇండియా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ ద్వారా కృత్రిమ మేధ వ్యవస్థల నైతిక, సురక్షిత, బాధ్యతాయుత వినియోగానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డీప్‌ఫేక్ వీడియోల పెరుగుదల నేపథ్యంలో ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌కు వాటర్‌మార్క్ తప్పనిసరి చేసే నిబంధనలు జారీ చేసినట్లు చెప్పారు. హానికరమైన సింథటిక్ మీడియాను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా డేటా రక్షణ, వినియోగదారుల హక్కులను బలోపేతం చేసినట్లు వివరించారు.దేశ భద్రత, మహిళలు, పిల్లలు, వృద్ధులు వంటి సున్నిత వర్గాలపై వచ్చే ముప్పులను దృష్టిలో ఉంచుకుని రిస్క్ అంచనా వ్యవస్థను రూపొందిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ‘ఏఐ ఫర్ ఆల్’ లక్ష్యంతో సురక్షిత, సమగ్ర కృత్రిమ మేధ వినియోగాన్ని ప్రపంచానికి చూపించడమే భారత్ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
