Let's talk: editor@tmv.in
ఏఐ సమ్మిట్ లో కృష్ణార్జునులు

ఏఐ సమ్మిట్ లో కృష్ణార్జునులు

Pinjari Chand
22 ఫిబ్రవరి, 2026

కృత్రిమ మేధస్సు (ఏఐ), అత్యాధునిక హోలోగ్రామ్ సాంకేతికత సాయంతో మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు డిజిటల్ అవతారాల్లో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈ వినూత్న ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని ‘జియో ఇంటెలిజెన్స్’ పావిలియన్‌లో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏఐ సాయంతో రూపొందించిన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ సిరీస్‌ నిర్మాణ ప్రక్రియను కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ సిరీస్ ఇప్పటికే జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై దాదాపు 17 ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

హోలోగ్రామ్‌లో మహాభారత వీరులు

పావిలియన్ మధ్యలో గుహ ఆకార నిర్మాణంపై ఏఐ సృష్టించిన కంటెంట్, సిరీస్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రదర్శిస్తున్నారు. రెండు పారదర్శక సిలిండర్ ఆకార క్యాప్సూల్‌లలో శ్రీకృష్ణుడు, అర్జునుడి ఏఐ రూపాలను హోలోగ్రామ్ రూపంలో ప్రొజెక్ట్ చేశారు. ప్రతి క్యాప్సూల్ పక్కన ఏర్పాటు చేసిన కన్సోల్ ద్వారా సందర్శకులు ప్రశ్నలు అడగవచ్చు. ధర్మం అంటే ఏమిటి?, మనిషిలోని పెద్ద శత్రువు ఎవరు?, జీవితం అన్యాయంగా అనిపిస్తే ఏం చేయాలి?, మనుషుల పెద్ద వలేమిటి?” లాంటి ప్రశ్నలకు ఏఐ అవతారాలు స్వర రూపంలో సమాధానాలు ఇస్తున్నాయి.

రూపకల్పన ప్రత్యేకత

శ్రీకృష్ణుడి అవతారం నీలి తళుకులతో మెరిసే శ్యామల వర్ణం, బంగారు వర్ణ వస్త్రాలు, మయూర పింఛంతో కూడిన కిరీటం, వేణువు, సంప్రదాయ చిత్రణకు సాంకేతిక మెరుగులు జోడించినట్లుగా కనిపిస్తోంది.అర్జునుడిని వెండి వర్ణ ధోతీ, ట్యూనిక్‌లో, కుడిచేతిలో గాండీవాన్ని పట్టుకుని గంభీరంగా చూపించారు. పాత ఇతిహాసాలను కొత్త తరం దగ్గరికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం. ఏఐ ద్వారా మహాభారతాన్ని పునఃసృష్టించాం. మొత్తం షో పూర్తిగా ఏఐ ఆధారంగా రూపొందించామని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు. పావిలియన్‌లో ఆరోగ్యం, ఫ్యాషన్ తదితర రంగాల్లో ఏఐ ఆధారిత పరికరాలను కూడా ప్రదర్శిస్తున్నారు.

ప్రపంచ నాయకుల సమక్షంలో సమ్మిట్

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాధినేతలు, గ్లోబల్ టెక్ దిగ్గజాల ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే.