
ఏఐ సమ్మిట్ నిరసన కేసులో ఐవైసీ కార్యకర్తలకు బెయిల్
ఏఐ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన ‘షర్ట్‌లెస్’నిరసన కేసులో అరెస్టైన ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ)కు చెందిన తొమ్మిది మంది కార్యకర్తలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిరసనను ప్రతీకాత్మక రాజకీయ విమర్శగా అభివర్ణిస్తూ, విచారణకు ముందే నిర్బంధించడం అనుచితమని కోర్టు పేర్కొంది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ రవి ఆదివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పొందినవారిలో కృష్ణ హరి, నర్సింహ యాదవ్, కుందన్ కుమార్ యాదవ్, అజయ్ కుమార్ సింగ్, జితేంద్ర సింగ్ యాదవ్, రాజా గుర్జర్, అజయ్ కుమార్ విమల్ అలియాస్ బంటు, సౌరభ్ సింగ్, అర్బాజ్ ఖాన్ ఉన్నారు. కోర్టు తన ఉత్తర్వులో ఈ నిరసన అత్యధికంగా ఒక ప్రజా కార్యక్రమంలో ప్రతీకాత్మక రాజకీయ విమర్శ మాత్రమే. నాయకుల చిత్రాలతో ఉన్న టీ-షర్టులు ధరించడం, ప్రేరేపించేలా లేని నినాదాలు , తాత్కాలిక సమూహంగా చేరడం జరిగింది. ఆస్తి ధ్వంసం, విదేశీ ప్రతినిధుల్లో భయాందోళనలు సృష్టించారనే ఆధారాలు లేవు. పోలీసుల రక్షణలో వారు శాంతియుతంగా బయటకు వెళ్లారని పేర్కొంది. విచారణకు ముందే నిర్బంధించడం శిక్ష విధించినట్టేనని, అది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. స్వేచ్ఛే ప్రధాన ప్రమాణమని, కారాగార శిక్ష మినహాయింపుగా ఉండాలనే క్రిమినల్ న్యాయ సూత్రాలను గుర్తు చేసింది.
అయితే బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. రాజ్యాంగం శాంతియుత నిరసన హక్కు కల్పించినా, కొన్ని షరతులు ఉంటాయని వాదించారు. ఐవైసీ కార్యకర్తలు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఇండియా–యూఎస్ ట్రేడ్ ఒప్పందాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారని తెలిపారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు గాయపడినట్టు, దానికి వైద్య ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20న ఏఐ సమ్మిట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఐవైసీ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రాలతో ముద్రించిన తెల్లటి టీ-షర్టులు ధరించి అలాగే చేతుల్లో పట్టుకుని నిరసన తెలిపారు. ఇండియా–యూఎస్ ట్రేడ్ డీల్, ఎఫ్‌స్టీన్ ఫైల్స్, పీఎం ఈజ్ కంప్రమైజ్డ్ వంటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందితో, పోలీసులతో స్వల్పంగా తోపులాట జరిగినట్టు అధికారులు తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు జోక్యం..ఉదయ్ భాను చిబ్‌కు బెయిల్ పునరుద్ధరణ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిరసన కేసులో ఉదయ్ భాను చిబ్‌కు లభించిన బెయిల్‌ను నిలిపివేసిన సెషన్స్ కోర్టు ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ సౌరభ్ బెనర్జీ ధర్మాసనం ముందు చిబ్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సెషన్స్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన తీర్పును చిబ్ సవాలు చేశారు.ఆర్డర్‌లో తగిన విధంగా ఆలోచన ఉండాలి. అది లేకపోతే ఆ ఉత్తర్వును స్టే చేయాల్సిందే,” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉత్తర్వులో కారణాలు ఎక్కడ ఉన్నాయి? మొదటి పేజీ చూడండి, తరువాతి పేజీ తిప్పండి — కారణం లేదా స్పష్టమైన నిర్ధారణ ఎక్కడ? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫిబ్రవరి 28న సెషన్స్ కోర్టు, చిబ్‌కు మెజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై మధ్యంతర స్టే విధించింది. అయితే అత్యంత అరుదైన, అసాధారణ పరిస్థితుల్లోనే ఎక్స్‌పార్టీ మధ్యంతర స్టే ఇవ్వాలని సెషన్స్ కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. హైకోర్టు తీర్పుతో చిబ్‌కు మళ్లీ బెయిల్ అమల్లోకి వచ్చింది. ఉత్తర్వు భౌతిక కాపీ అందిన వెంటనే చిబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముందని ఆయన న్యాయవాది మీడియాకు తెలిపారు.
