Let's talk: editor@tmv.in
ఏఐ సమ్మిట్‌ నిరసనలకు రాహుల్ గాంధీనే రూపకర్త: బీజేపీ

ఏఐ సమ్మిట్‌ నిరసనలకు రాహుల్ గాంధీనే రూపకర్త: బీజేపీ

Pinjari Chand
11 మార్చి, 2026

ఇటీవల దేశ రాజధానిలో నిర్వహించిన ప్రపంచ ఏఐ సదస్సు సందర్భంగా జరిగిన నిరసనలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీనే రూపకర్త అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. దేశాన్ని అంతర్జాతీయ వేదికపై అవమానించేందుకు ఆయన ప్రయత్నించారని విమర్శించింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ, జాతీయ ప్రతినిధి సంబిత్‌పాత్ర ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు సమయంలో ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు చేపట్టిన నిరసన యాదృచ్ఛికం కాదని, ముందుగానే పన్నిన ప్రణాళికలో భాగమని ఆయన ఆరోపించారు. ఆ సమయంలోనే మేము ఇది కాంగ్రెస్‌ పార్టీ చేసిన ‘టాప్‌లెస్‌, బ్రెయిన్‌లెస్‌, షేమ్‌లెస్‌’ నిరసన అని చెప్పాము. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు, పూర్వ ప్రణాళికతో చేసిన చర్య అని సంబిత్ పాత్ర అన్నారు.

ఈ నిరసనలకు రూపకల్పన రాహుల్ గాంధీ నివాసంలోనే జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. సోమవారం పార్టీ సమావేశంలో ఏఐ సమ్మిట్‌ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన తానే దీనికి బాధ్యత వహించినట్లు అంగీకరించినట్లుగా కనిపించిందని చెప్పారు. నిన్న రాహుల్ గాంధీ ‘హాన్‌, హమ్‌నే కామ్‌ కర్‌ దియా’ (అవును, మేము పని పూర్తి చేశాం) అని అన్నారు. ఆ సమయంలో ఆయన ముఖంలో మీర్ జాఫర్‌లాంటి చిరునవ్వు కనిపించిందని పాత్ర విమర్శించారు. చరిత్రలో మీర్ జాఫర్ బెంగాల్‌ సేనాధిపతిగా ఉండి సిరాజుద్దౌలాను ప్లాసీయుద్ధం సమయంలో మోసం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. దేశం అంతర్జాతీయంగా అవమానానికి గురవుతుంటే ఆనందపడే వ్యక్తి దేశద్రోహి మాత్రమే అవుతాడని సంబిత్ పాత్ర అన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావు. భారత్‌ తలవంచదు, ముందుకు సాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. అలాగే పార్లమెంట్‌లో ఆయన ప్రవర్తనపై కూడా బీజేపీ నేత విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో మర్యాదలు పాటించని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని అన్నారు.

ఏఐ సమ్మిట్‌ నిరసనలకు రాహుల్ గాంధీనే రూపకర్త: బీజేపీ - Tholi Paluku